పల్లె నుంచి టోక్యోదాకా వెళ్లిన తెలుగమ్మాయి

పల్లె నుంచి టోక్యోదాకా వెళ్లిన తెలుగమ్మాయి

ఈ ఫొటో చూడంగనే గోల్​ కీపర్ అనే విషయం తెలుస్తోంది కదా. మీ గెస్​ కరెక్టే. ఈ గోల్ కీపర్​ పేరు ఎతిమరపు రజని. ఇండియన్ హాకీ టీంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఈమెది ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా. మారుమూల గ్రామంలో పుట్టి దేశం మొత్తం గర్వించేంత ఎత్తుకు ఎదిగిన రజని గురించి...

తిరుపతి నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న యనమలవారిపల్లి రజని సొంతూరు. ఏడో తరగతి వరకు ఆ ఊళ్లోనే చదువుకుంది. ఎనిమిదో తరగతికి జెడ్​పిహెచ్​ స్కూల్​లో  జాయిన్​ అయింది. అప్పటికి తనకి స్పోర్ట్స్​ గురించి అవగాహన లేదు. తండ్రి రమణాచారి కార్పెంటర్​, తల్లి తులసి కూడా రజనిని స్పోర్ట్స్​కి పంపడానికి ఒప్పుకోలేదు. అందుకు కారణం డబ్బు సరిపోకపోవడమే.  

వాళ్ల స్కూల్​ పీఈటీ నెరబైలు వెంకటరాజా స్పోర్ట్స్​లో  స్టూడెంట్స్​ని బాగా ఎంకరేజ్​ చేసేవారు. రజని వాలీబాల్​ ఆడుతుండేది. ఆ టైంలో జోనల్​ హాకీ టోర్నమెంట్​ కోసం వాళ్ల టీం గోల్​ కీపర్​ కోసం చూస్తున్నారు. రజని ఎత్తు​ చూసి తనైతే బాగా ఆడగలదని టీంకి సెలక్ట్​ చేసుకున్నారు. చదువుకుంటూనే స్పోర్ట్స్​లో పార్టిసిపేట్ చేయొచ్చు. పైగా స్పోర్ట్స్​ కోటాలో జాబ్స్​ కూడా వస్తాయనడంతో ముందడుగేసింది రజని. ఏపి ఉమెన్స్​ హాకీ అసోసియేషన్​ సెక్రెటరీ ప్రసన్న కుమార్​ రెడ్డి, పీఈటీలు రజని అమ్మానాన్నల్ని ఒప్పించారు. తిరుపతిలో ఉన్న ఏపి రీజనల్​ హాకీ అకాడమీలో చేరింది. తర్వాత హైదరాబాద్ వచ్చి ఎస్​ఏఐ హాస్టల్​లో చేరింది. ఆ తర్వాత ఇండియన్​ టీంకి సెలక్ట్ అయింది.

ఇండియా టీంలో 2009 నుంచి ఆడుతోంది. 2013లో జపాన్​లో జరిగిన ఏషియన్​ ఛాంపియన్​షిప్​లో ఇండియన్​ హాకీ టీం కప్పు సాధించింది. ఆ ఆటలో కీలకపాత్ర వహించింది గోల్​కీపర్​ రజని. 2016లో ఏషియన్​ ఛాంపియన్​ ట్రోఫీ గెలుచుకుంది. 2017 నవంబర్​ 5న చైనాతో జరిగిన చివరి ఆటలో హాకీ విమెన్స్​ టీం గెలిచింది. దాదాపు13 ఏళ్లకు ఈ విజయం వరించింది. అందుకు కారణం  గోల్​కీపర్​ రజని. ఆమె హైట్​ ఆమెకి ఎంతో ప్లస్​ అని ఎందరో మెచ్చుకున్నారు. ఉత్తమ గోల్​కీపర్​గా అవార్డు కూడా అందుకుందామె. తన ప్రతిభకు గుర్తింపుగా అప్పటి ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం తనకి ‘సాప్’​లో సభ్యత్వం ఇచ్చింది. ఫస్ట్ టోర్నమెంట్​ 2009లో న్యూజిలాండ్​లో  ఆడింది. తర్వాత ఏషియన్ ఛాంపియన్​షిప్​ ట్రోఫీ, కామన్వెల్త్​ గేమ్స్​, ఏషియన్ కప్, సమ్మర్ గేమ్స్​లో పాల్గొన్నది. 2014లో గాయం వల్ల బ్రేక్​ తీసుకుని, 2015లో మళ్లీ వచ్చింది. టోక్యోలో జరుగుతున్న 2020 ఒలింపిక్స్​ ఇండియన్​ విమెన్​ హాకీ టీంలో ఆడి ఒలింపియన్​ అనిపించుకుంది ఈ తెలుగమ్మాయి.

‘‘విలేజ్​లో ఉండే పిల్లలకు స్పోర్ట్స్​ గురించి చెప్పాలి. అకాడమీలు ఉండడం వల్ల చాలామంది అమ్మాయిలు ముందుకొస్తున్నారు. పిల్లలకు కావాల్సిన ఎంకరేజ్​మెంట్ ఇస్తే ఏ రంగంలోనైనా రాణించగలరు” అంటోంది రజని.