హోంగార్డులకు మూడు నెలలుగా జీతాల్లేవు..

హోంగార్డులకు మూడు నెలలుగా జీతాల్లేవు..

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసుల్లో పనిచేస్తున్న హోంగార్డుల పరిస్థితి దయనీయంగా మారింది. మూడు నెలలుగా జీతాలు రాక తీవ్రఇబ్బందులు పడుతున్నారు . ఇల్లు గడవక దొరికిన చోటల్లా అప్పులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు కనికరించటం లేదు. బడ్జెట్ లేదు.. మేము చేసేదేమీ లేదని సమాధానమిస్తున్నారు . దీంతో తమబాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక హోంగార్డులు సతమతవుతున్నారు. గట్టిగా అడిగితే ఏం ఇబ్బంది పెడతారోనని వారిలో వారే మదనపడుతున్నారు . రాష్ట్రంలో ప్రభుత్వానికి అత్యధికఆదాయం ఇస్తున్న డిపార్ట్ మెంట్లలో ట్రాన్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ఒక్కటి. అయితే దురదృష్టకరమేంటంటే ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే హోంగార్డులకు జీతాలు ఇచ్చేందుకు డబ్బులులేకపోవటమే.

హోంశాఖ పరిధిలో ఉండే హోంగార్డులను రాష్ట్రంలోని డిపార్ట్ మెంట్లు వారిగా, అవసరాలకు అనుగుణంగా కేటాయించారు. ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ లో కూడా ఆర్టీఏ కార్యాలయాల్లో వివిధ పనుల నిమిత్తం హోంగార్డులను కేటాయించారు. గ్రేటర్ పరిధిలో ఉన్న 11 ఆర్టీఏ కార్యాలయాల్లో దాదాపు 100 మందికి పైగా హోంగార్డులు పనిచేస్తున్నారు. వీరు ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చే జనాలను ఇబ్బంది లేకుండా క్యూ పద్ధతి పాటించేలా చర్యలు తీసుకుంటారు. మోటారు వెహికిల్ ఇన్ స్పెక్టర్లకు సహాయంగా ఉంటారు. వాహనాల తనిఖీల సందర్భంగా సెక్యూ రిటీగా ఉంటారు. వీరికి జీతాలు చెల్లించేందుకు ప్రత్యేకంగా బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్నుంచే హోంగార్డులకు జీతాలు చెల్లిస్తుంటారు. అయితే మూడు నెలల నుంచి వీరి జీతాలకుసంబంధించి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం బడ్జెట్ ను విడుదల చేయటం లేదు. చేసేదేమీ లేక తప్పనిసరి పరిస్థితుల్లో హోంగార్డులు డ్యూటీకి వస్తున్నారు . ఇతర డిపార్ట్ మెంట్లలో పనిచేస్తున్నహోంగార్డులకు మాత్రం జీతాలు చెల్లిస్తున్నారని వారు చెబుతున్నారు .

పిల్లలకు పుస్తకాలు కొనిచ్చేదేలా?
మూడు నెలలుగా జీతాలు రాకపోవటంతో హోంగార్డులు కుటుంబాన్ని పోషించేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు . రాష్ట్ర ప్రభుత్వం నుంచి నెలకు వీరికి రూ.20 వేల వరకు జీతం వస్తుంది. సిటీలో ఉండే హోంగార్డుల కుటుంబాలకు ఈజీతం ఇంటి అద్దె, కుటుంబ ఖర్చులకే సరిపోతుంటుంది. అలాంటి ది మూడు నెలల నుంచి జీతంరాకపోవటంతో వారికి అప్పు కూడా పుట్టటంలేదు. ఇంటి అద్దె కోసం ఓనర్లు ఇబ్బంది పెడుతున్నారని పలువురు హోంగార్డులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు . జీతం లేకుండా మూడు నెలల పాటుకుటుంబాన్ని గడపటమంటే మమాలు విషయంకాదని చెబుతున్నారు . పైగా నేటి నుంచి రంజాన్ ఉపావాసాలు ప్రారంభమవుతున్నాయి. హోంగార్డులలో చాలా మంది ముస్లిం లు ఉన్నారు.
రంజాన్ నెల ప్రారంభం కావటంతో పండుగఎలా జరుపుకునేదని వారు ఆందోళన చెందుతున్నారు . పిల్లలకు, కుటుంబ సభ్యులకు బట్టలు,ఇతర పండుగ సామగ్రి ఎలా కొనాలని ప్రశ్నిస్తున్నారు . అలాగే వచ్చే నెలలో స్కూళ్లు ప్రారంభం కానుండటంతో పిల్లల ఫీజులు, పుస్తకాలు ఇతరఖర్చులకు డబ్బులు ఎలా అని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . ఇప్పటికే చేసిన అప్పులు కట్టాలని ఒత్తిడి పెరిగిపోయిందని ఈనెల జీతాలు ఇస్తేనే కుటుంబాలు గడుస్తాయని చెబుతున్నారు .

బడ్జెట్ లేకనే చెల్లించలేకపోతున్నాం -.పాండురంగ నాయక్, జేటీసీ
హోంగార్డులకు జీతాలు ఇప్పించేందుకు మావంతు ప్రయత్నం చేస్తున్నాం. వారి జీతాలకు సంబంధించి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ వస్తుంది. మూడు నెలలుగా డబ్బులు లేవు. దీంతోనే జీతాలు చెల్లించలేకపోతున్నాం. వారిపరిస్థితి అర్థం చేసుకోగలం. వచ్చే నెల డబ్బులు తప్పకుండా వస్తాయన్న నమ్మకం ఉంది. వచ్చేనెల హోంగార్డులందరికీ పెండింగ్ జీతాలు ఇచ్చే ఏర్పాటు చేస్తాం . భవిష్యత్ లో ఇలాంటి సమస్య లేకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం.