- రోడ్డు ప్రమాద పరిహారం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: గృహిణుల (ఇల్లాలు) అపరిమితమైన శ్రమను, కుటుంబం కోసం వారు చేసే త్యాగాలను గుర్తిస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఇల్లాలు కేవలం ఇంటి పనులకే పరిమితం కాదని, వారు "దేశ నిర్మాతలు" అని కొనియాడింది. మోటారు వాహన ప్రమాదాల్లో భార్యను కోల్పోయినప్పుడు, ఆమె కుటుంబానికి అందించే గృహ సంరక్షణ లోటును నెలకు కనీసం రూ.30 వేల ఆదాయంగా పరిగణించి పరిహారాన్ని లెక్కించాలని స్పష్టం చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘సంపాదించే కుటుంబ సభ్యులపై గృహిణి ఆధారపడుతుందని అనడం కేవలం ఒక అపోహ మాత్రమే. వాస్తవానికి ఆ ఇల్లు సజావుగా సాగడం పూర్తిగా ఇల్లాలు పైనే ఆధారపడి ఉంటుంది’’ అని పేర్కొంది.
‘‘సంపాదించేవారే నిజానికి గృహిణిపై పూర్తిగా ఆధారపడతారు. కానీ, వాస్తవానికి సమాజంలో దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదు. భవిష్యత్‌లో ఆమెను ‘గృహిణి’ అనడం కంటే ‘దేశ నిర్మాత’ అని పిలవడమే సముచితం’’ అని- ధర్మాసనం తెలిపింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో మహిళల పాత్ర అమూల్యమైనదని పేర్కొంది. దేశ జీడీపీలో మహిళల ఉచిత సేవల వాటా 15 నుంచి 17 శాతం వరకు ఉంటుందని కోర్టు గుర్తుచేసింది. రోడ్డు ప్రమాదాల పరిహారం కేసుల్లో జరుగుతున్న జాప్యంపై ఆందోళన వ్యక్తం చేసిన కోర్టు.. ఈ కేసులను ఏడాదిలోపు పరిష్కరించేలా చూడాలని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది. 2001లో పంజాబ్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాద కేసుకు సంబంధించిన అప్పీల్ విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది.
పీసీపీఎన్డీటీ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి..
సమాజంలో ఇంకా కొనసాగుతున్న పితృస్వామ్య పోకడలు, రహస్య లింగ నిర్ధారణ పరీక్షలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో బాలికల నిష్పత్తి 1991లో 945 నుంచి 2011 నాటికి 919కి పడిపోవడం ఆందోళనకరమని పేర్కొంది. ప్రజల మానసిక స్థితిలో మార్పు వచ్చేవరకు గర్భధారణ పూర్వ, ప్రసవ పూర్వ లింగ నిర్ధారణ నిషేధ (పీసీపీఎన్డీటీ) చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు దాటినా దేశ రాజధాని ఢిల్లీతో సహా పలు నగరాల్లో ఆడపిల్లల చదువు, రక్షణ కోసం ఇంకా పోస్టర్ల ద్వారా ప్రచారం చేయడం విచారకరమని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆడపిల్ల పుట్టే హక్కుపై ఎలాంటి ప్రశ్నలు లేని రోజే నిజమైన సమానత్వం సిద్ధిస్తుందని పేర్కొంటూ లింగ నిర్ధారణ కేసులో ఓ వైద్యుడి అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది.
