కరోనా ట్రీట్‌మెంట్‌ బిల్లు చూసి షాక్‌.. పేదల కోసం ఆఫీస్‌ బిల్డింగ్‌నే హాస్పిటల్‌గా మార్చిండు

కరోనా ట్రీట్‌మెంట్‌ బిల్లు చూసి షాక్‌.. పేదల కోసం ఆఫీస్‌ బిల్డింగ్‌నే హాస్పిటల్‌గా మార్చిండు
  • సూరత్‌లో ఒక వ్యాపారి ఆలోచన

సూరత్‌: కరోనా ట్రీట్‌మెంట్‌ కోసం ప్రైవేట్‌ హాస్పిటల్‌కు పర్మిషన్‌ ఇచ్చినప్పటి నుంచి హాస్పిటళ్లు బిల్లుల మోత మోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఒక వ్యాపారి తనకు ప్రైవేట్‌ హాస్పిటల్‌ వాళ్లు వేసిన బిల్లుకు షాక్‌ తిన్నాడు. తనకే ఇలా ఉంటే ఇక పేదల పరిస్థితి ఏంటి అని ఆలోచించాడు. అందుకే పేదలకు హెల్ప్‌ చేసేందుకు ఒక ఆలోచన చేశాడు. తన ఆఫీస్‌నే కరోనా హాస్పిటల్‌గా మార్చేశాడు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వ్యాపారికి కరోనా రావడంతో 20 రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ రావడంతో హాస్పిటల్‌లో చేరి ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు. ఆ హాస్పిటల్‌ వాళ్లు అతడికి లక్షల్లో బిల్లు వేశారు. దీంతో తనకే ఇంత ఇబ్బంది ఉంటే పేదల పరిస్థితి ఏంటి అని అనుకున్నాడు. దాంతో తన ఆఫీస్‌ బిల్డింగ్‌లో 85 పడకలతో కరోనా హాస్పిటల్‌ను ఏర్పాటు చేశాడు. అధికారులతో మాట్లాడి పర్మిషన్‌ తీసుకుని తన ఆఫీస్‌లోని కొంత భాగంలో బెడ్లు ఏర్పాటు చేయించారు. ప్రభుత్వం తరఫు మెడికల్‌ స్టాఫ్‌ ఆ హాస్పిటల్‌లో పనిచేస్తున్నారు. “ ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లో కరోనా ట్రీట్‌మెంట్‌ ఖర్చు చాలా ఎక్కువ. పేదలు ఎలా భరించగలరనే ఆలోచన వచ్చింది. అందుకే అధికారుల పర్మిషన్‌తో ఈ నిర్ణయం తీసుకున్నాను” అని ఆ వ్యాపారి చెప్పారు. కులం, మతం అనే భేదం లేకుండా ఎవరైనా ఆ హాస్పిటల్‌లో చేరొచ్చని అన్నారు.