- ఉద్యాన వర్సిటీలో కొత్తగా ఎంబీఏ కోర్సు..
- వర్సిటీ అకాడమిక్ కౌన్సిల్ ఆమోదం
- 25 సీట్లతో 2026-27 నుంచి ప్రారంభం
- సరికొత్తగా జెనెటిక్స్, ఎంటమాలజీ పీజీ కోర్సులు
- ఆమోదం తెలిపిన వర్సిటీ అకాడమిక్ కౌన్సిల్
హైదరాబాద్, వెలుగు: ఉద్యాన వర్సిటీలో 2026–-27 విద్యా సంవత్సరం నుంచి ఎంబీఏ (హార్టి బిజినెస్ మేనేజ్‌మెంట్) కోర్సును ప్రారంభించేందుకు అకాడమిక్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. వర్సిటీ వీసీ డాక్టర్ దండా రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన అకాడమిక్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 25 సీట్లతో ప్రారంభం కానున్న ఈ ఎంబీఏ కోర్సులో బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసిన విద్యార్థులు ప్రవేశాలకు అర్హులని అధికారులు తెలిపారు. అలాగే పీజీ స్థాయిలో జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, ఎంటమాలజీ విభాగాలను నూతనంగా ప్రారంభించాలని నిర్ణయించారు.
ఇప్పటికే ప్రారంభమైన అశ్వరావుపేట హార్టీకల్చర్ కాలేజీకి అకాడమిక్ కౌన్సిల్ ఆమోదం తెలపగా.. ఈ విద్యా సంవత్సరంలో 30 సీట్లతో డిగ్రీ కోర్సులో ప్రవేశాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే 2026 సెప్టెంబరులో వర్సిటీ 5వ కాన్వోకేషన్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వీసీ రాజిరెడ్డి మాట్లాడుతూ ఉద్యాన పంటల్లో అధిక దిగుబడినిచ్చే కొత్త రకాల అభివృద్ధి, ఆధునిక జీవసాంకేతిక పరిశోధనలకు ఊతమివ్వాలనే లక్ష్యంతో జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ విభాగాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.
పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి పర్యావరణహిత సాగు విధానాలను ప్రోత్సహించేందుకు ఎంటమాలజీలో పీజీ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు ఉన్నత ప్రమాణాల జర్నల్స్‌లో పరిశోధనా పత్రాలు ప్రచురించేలా ప్రోత్సహిస్తామని, అమెరికా, భారత్‌లోని ప్రముఖ పరిశోధన సంస్థల్లో పరిశోధనలు నిర్వహించేందుకు అవకాశాలు కల్పిస్తామని వివరించారు.
సమావేశంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ భగవాన్, డీన్ ఆఫ్ హార్టికల్చర్ డాక్టర్ చీనా, పీజీ డీన్ డాక్టర్ సురేష్, కన్సల్టెంట్ డాక్టర్ వీరాంజనేయులు, అకాడమిక్ కౌన్సిల్ సభ్యులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. అనంతరం వర్సిటీలో ఉద్యాన పంటల టెస్టింగ్, ఆధునిక పరిశోధన సదుపాయాల వినియోగంపై డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ కుమార్ అభిషేక్, ఎస్. సుమన్‌తో పాటు బ్లూడోర్ గ్లోబల్ యాక్షన్ వ్యవస్థాపకురాలు సప్నా సుబ్రమణ్యంతో చర్చలు జరిపారు.
