
హైదరాబాద్, వెలుగు: హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి జీహెచ్ఎంసీ పరిధితో పాటు పలు పట్టణ ప్రాంతాల్లో ప్లాట్ల విక్రయాలు జరగనున్నాయి. సోమవారం హైదరాబాద్ లోని చింతల్, నిజాంపేట బాచుపల్లి ప్రాంతంలో ఉన్న 22 రెసిడెన్షియల్ ప్లాట్స్, ఫ్లాట్స్ ను హౌసింగ్ బోర్డు బహిరంగ వేలం ద్వారా విక్రయించనుంది. చింతల్ 18 ఎంఐజీ, హెచ్ ఐజీ ప్లాట్లు (ప్లాట్స్), నిజాం పేట బాచుపల్లిలో 4 ఫ్లాట్లను బహిరంగ వేలం వేయనున్నామని బోర్డు అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇటీవల కేపీహెచ్ బీ కాలనీ ప్రాంతంలో హౌసింగ్ బోర్డు పలు దఫాలుగా నిర్వహించిన భూముల విక్రయాల్లో ఎకరా భూమిని రూ.70 కోట్లకు ఈ వేలంలో గోద్రేజ్ ప్రాపర్టీస్ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో అదే కాలనీలో నాలుగు కమర్షియల్ ప్లాట్లను ఈ నెల 7, 8వ తేదీల్లో ఈ-వేలం ప్రక్రియ ద్వారా విక్రయించనున్నారు. అలాగే నాంపల్లిలోని కమర్షియల్ ప్లాట్ ను కూడా 8న ఈ-వేలం వేయనున్నారు.