- ఇంకో రెండు నెలల్లో మరో 2 లక్షలు ఇండ్లు నిర్మిస్తం
- నేడు ఆసిఫాబాద్ జిల్లాలో రెండో విడత స్కీమ్ ప్రారంభిస్తున్నామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: స్వతంత్ర భారత చరిత్రలో వంద శాతం సబ్సిడీతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ దేశానికే ఆదర్శం అని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేవలం ఇండ్ల నిర్మాణమే కాకుండా పేద కుటుంబాల జీవితాలను మార్చేస్తున్న సామాజిక ఉద్యమంగా ఈ కార్యక్రమం మారిందన్నారు. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షలకు పైగా ఇండ్లను మంజూరు చేశామని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
సోమవారం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత ఇండ్లను ప్రారంభించనున్నారని చెప్పారు. రెండో విడతలో 2.5 లక్షల ఇండ్ల మంజూరుతో రెండు విడతల్లో కలిపి ఒక్కో నియోజకవర్గానికి 5,500 నుంచి 6,500 ఇండ్లను మంజూరు చేసినట్లు అవుతుందన్నారు. ఐటీడీఏ ప్రాంతాల్లోని గిరిజన నియోజకవర్గాలకు అదనంగా 500 నుంచి 1,500 వరకు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. నిరుడు ఫిబ్రవరిలో నారాయణ పేట జిల్లాలో తొలి విడత ఇండ్ల స్కీమ్‌ను సీఎం ప్రారంభించారని గుర్తుచేశారు. ఈ 13 నెలల్లో లక్ష ఇండ్లను పూర్తి చేశామని, మరో ఒకటి రెండు నెలల్లో మరో 2 లక్షల ఇండ్లు పూర్తికాబోతున్నాయని తెలిపారు. ఈ ఏడాది క్యూర్ పరిధిలో లక్ష ఇండ్లకు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 2.50 లక్షల ఇండ్లను మొత్తం 3.50 లక్షల ఇండ్ల మంజూరుకు పరిపాలనా అనుమతులు ఇచ్చామని వెల్లడించారు.
సొంత నిధులతో ఇండ్లు కట్టిస్తున్నం..
దేశంలోని చాలా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరిమిత నిధులతోనే గృహ నిర్మాణాలు కొనసాగిస్తున్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ‘పేదవాడి ఇల్లు – ప్రభుత్వ బాధ్యత’అనే లక్ష్యంతో సొంత నిధులతో ముందుకెళ్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రం రూ.72 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు మాత్రమే ఇస్తున్నా, తెలంగాణ ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారుడికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఇండ్లు మంజూరై, ఇప్పటి వరకు పూర్తికాని ఇండ్లకు రెండో విడతలో అవకాశం ఇస్తున్నామని చెప్పారు. 2023లో గృహ లక్ష్మి పథకంలో ఇండ్లు మంజూరై, ఇప్పటికీ పూర్తి చేసుకోలేకపోయిన వారికి కూడా ఇదే విడతలో ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన ఇందిరమ్మ పథకంలో రూ.20 వేల వరకు ఆర్థిక సాయం పొందిన వారికి కూడా ఈ విడతలో ఇండ్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.
