టాటాల స్టార్టప్స్​ వేట..కొన్నవన్నీ అగ్గువకే

టాటాల స్టార్టప్స్​ వేట..కొన్నవన్నీ అగ్గువకే

ఆన్‌‌లైన్‌‌ షాపింగ్​ బిజినెస్​లో  ఆధిపత్యం కోసం  ఎన్‌‌.చంద్రశేఖర్‌‌ నాయకత్వంలోని టాటా గ్రూప్‌‌ చాలా కష్టపడుతోంది. ఎంట్రీ కొంత ఆలస్యమైనా దూసుకెళ్లడానికి తనవైన వ్యూహాలను గ్రూప్​ అమలు చేస్తోంది. తన టార్గెట్‌‌ కంపెనీలను ఒప్పించడానికి టాటా టీమ్‌‌ ఏకంగా నెలల తరబడి డిస్కషన్స్​ చేస్తోంది. అగ్గువకే  బిగ్‌‌బాస్కెట్‌‌, 1ఎంజీ వంటి   స్టార్టప్​ కంపెనీలను చేజిక్కించుకోవడంలో కొంత మేర టాటా గ్రూప్​ సక్సెసయింది. ఇక్కడితో టాటాల స్టార్టప్​ల వేట ముగిసిపోలేదు. మరింతగా ఆన్​లైన్​ బిజినెస్​లలో దూసుకెళ్లడానికి సూపర్​ యాప్​ తెచ్చే పనిలో ఉన్న టాటా గ్రూప్​, ఇందుకు  సాయపడే టార్గెట్​ కంపెనీల కోసం ఇంకా వెతుకుతూనే ఉంది.


న్యూఢిల్లీ: ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ బిజినెస్‌‌లో ఎలాగైనా దూసుకెళ్లాలన్న టార్గెట్‌‌ను చేరుకోవడానికి టాటాలు తెలివిగా వ్యవహరిస్తున్నారు. కష్టాల్లో ఉన్న కంపెనీలను సెలక్ట్‌‌ చేసుకుని, వాటిని కొనేందుకు  ఓపిగ్గా చర్చలు జరిపారు. నెలల తరబడి బేరసారాలు ఆడారు.   డిస్కౌంట్‌‌ ప్రైసింగ్‌‌కు ఒప్పుకునేలా స్ట్రాటజీలు అమలుచేశారు. కన్వర్టబుల్‌‌ ఇన్‌‌స్ట్రమెంట్ల ద్వారా టాటా డిజిటల్‌‌ 1ఎంజీ, బిగ్‌‌ బాస్కెట్లను కొనగలిగింది. క్యూర్‌‌ఫిట్‌‌లోనూ ఇన్వెస్ట్‌‌ చేసింది.  ఇక్కడితో టాటాలు ఆగిపోవడం లేదు. మరిన్ని కంపెనీల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఏయే కంపెనీల్లో ఎన్ని వాటాలు ఈ గ్రూప్​ కొందనే విషయంపై  ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఆన్‌‌లైన్‌‌ గ్రాసరీ కంపెనీ బిగ్‌‌బాస్కెట్‌‌, ఆన్‌‌లైన్‌‌ హెల్త్‌‌కేర్‌‌ కంపెనీ 1ఎంజీలో మెజారిటీ షేర్లు కొన్నామని మాత్రమే టాటా ఇప్పటిదాకా  ప్రకటించింది. క్యూర్‌‌ఫిట్‌‌లో 75 మిలియన్‌‌ డాలర్లు ఇన్వెస్ట్‌‌ చేయడానికి ఎంఓయూ కుదుర్చుకున్నామని తెలిపింది. ఇంతకుమించి ఏమీ చెప్పలేదు. 

క్లారిటీ ఇవ్వలే...

తగినంత క్యాపిటల్‌‌ లేకపోవడం, విపరీతమైన పోటీ, కరోనా కష్టాల వల్ల టాటాలవైపు ఈ స్టార్టప్​ కంపెనీలు  చూశాయని చెప్పొచ్చు. వాల్యుయేషన్‌‌ను తగ్గించినప్పటికీ బిగ్‌‌బాస్కెట్‌‌ టాటాలకు నో చెప్పలేకపోయింది. ఇండియా ఆన్‌‌లైన్‌‌ కిరాణా సెగ్మెంట్‌‌లో ఈ స్టార్టప్‌‌కు 37 శాతం మార్కెట్‌‌ షేర్‌‌ ఉన్నప్పటికీ, షేర్‌‌ ధర తగ్గింపునకు ఒప్పుకుంది.  టాటాలు ఇందులో 53 శాతం వాటా దక్కించుకున్నారని ఫైనాన్షియల్‌‌ ఎక్స్‌‌పర్టులు చెబుతున్నారు. 1ఎంజీ విషయంలోనూ టాటాలు చాలా లాభపడ్డారు. 2018 డిసెంబరు నాటి ధరలతో 1ఎంజీ షేర్లను కొన్నారు. వాల్యుయేషన్‌‌ను పెంచలేదు.  ప్రిఫరెన్స్‌‌ షేర్లను కూడా 20 శాతం డిస్కౌంట్‌‌తో కొన్నారు. 2018 నుంచి కంపెనీ  గ్రోత్‌‌ డబుల్‌‌ అయినప్పటికీ పాత రేట్లతోనే వాటాలను కొన్నారు. ఇలా 1ఎంజీలోనూ మెజారిటీ వాటా దక్కించుకున్నారు. నాలుగు కోట్ల మంది కస్టమర్ బేస్‌‌తో ఈ స్టార్టప్‌‌ ఇండియాలో టాప్‌‌–2 ఆన్‌‌లైన్‌‌ హెల్త్‌‌కేర్‌‌ కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది. కరోనా వల్ల విపరీతంగా నష్టపోయిన క్యూర్‌‌ఫిట్‌‌ కూడా అగ్గువకే అమ్ముడుపోయింది. కంపెనీలతో డీల్స్‌‌ కుదుర్చుకోవడానికి టాటా చైర్మన్‌‌ చంద్రశేఖరన్‌‌ స్వయంగా ఒక టీమ్‌‌ను నియమించారు. బేరాలు ఆడటం , బిజినెస్‌‌ స్ట్రాటజీలు అమలు చేయడం, ఎదుటి కంపెనీల బలహీనతలు గుర్తించడం ద్వారా ఈ టీం తమ కంపెనీ తక్కువ పెట్టుబడులతో స్టార్టప్‌‌లను దక్కించుకునేలా చేసింది. నిజానికి ఈ మూడు కంపెనీలకు ఎక్కువ వాల్యుయేషన్‌‌తో ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే  బ్రాండ్‌‌నేమ్‌‌ కారణంగా స్టార్టప్‌‌లు టాటాకే ఓటేశాయి. రిలయన్స్‌‌ కూడా ఇదే స్ట్రాటజీని ఎంచుకుంది. కష్టాల్లో ఉన్న జివామే, అర్బన్‌‌ లాడర్‌‌, మిల్క్‌‌ బాస్కెట్లను చాలా తక్కువ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌తో కొనేసింది.

1ఎంజీ వాల్యుయేషన్‌‌‌‌ స్టోరీ ఇది..

కేడబ్ల్యూఈ బీటిల్‌‌‌‌గంగెన్‌‌‌‌ ఏజీ 2018 డిసెంబర్ లో  175 మిలియన్ డాలర్ల  వాల్యుయేషన్‌‌‌‌ వద్ద 44 మిలియన్ డాల ఫండింగ్‌‌‌‌ను 1ఎంజీకి అందించింది. ప్రతి షేరు ధర రూ.34.418. ఐఎఫ్‌‌‌‌సీ.. ఏప్రిల్ 2019లో 21 మిలియన్ల డాలర్లు ఇన్వెస్ట్‌‌‌‌ చేసింది.  హెచ్​బీఎం హెల్త్‌‌‌‌కేర్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్స్,  కేడబ్ల్యూఈ బీటిల్​బీటిల్‌‌‌‌గంగెన్ ఏజీ  గత జూలైలో  18 మిలియన్‌‌‌‌ డాలర్లు ఇన్వెస్ట్‌‌‌‌ చేశాయి. ఇది ఫ్లాట్‌‌‌‌రౌండ్‌‌‌‌.  పోస్ట్-మనీ వాల్యుయేషన్  206 మిలియన్​ డాలర్లు. ఈసారి కూడా షేరు ధర మారలేదు. ఈ ఏడాది మార్చిలో ఇంటర్నల్‌‌‌‌ రౌండ్‌‌‌‌ ద్వారా డబ్బు సమకూరింది. ప్రస్తుత ఇన్వెస్టర్లే కొద్దికొద్దిగా డబ్బు సర్దారు. వాల్యుయేషన్‌‌‌‌ దాదాపు 10 శాతం పెరిగింది. ఏప్రిల్‌‌‌‌లో టాటాలు రూ.l00 కోట్ల డెట్‌‌‌‌ను ఆఫర్‌‌‌‌ చేశారు. దీంతో వారికి  29,054 కంపల్సరీ కన్వర్టబుల్‌‌‌‌ డిబెంచర్లు జారీ అయ్యాయి. ధర రూ.34,416. టాటాలు మేనెలలోనూ మరో రౌండ్ డెట్‌‌‌‌ ఆఫర్‌‌‌‌ చేశారు. దీంతో వీరికి1,17,197 ఆప్షనల్లీ కన్వర్టబుల్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లు జారీ అయ్యాయి. వీటి విలువ రూ.323 కోట్లు. ఒక్కొక్కదాని షేరు ధర రూ.27,535. మరో 134 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ల కోసం- టాటాలు 364 మిలియన్ డాలర్ల వాల్యుయేషన్ వద్ద 37శాతం తీసుకున్నారు. ప్రీ-మనీ వాల్యుయేషన్ 222 మిలియన్ డాలర్లు. ప్రీమనీ వాల్యుయేషన్‌‌‌‌ ఏడాది క్రితం పోస్ట్‌‌‌‌ మనీ వాల్యుయేషన్‌‌‌‌ కంటే కొద్దిగా ఎక్కువ.