దేశంలో వైద్య ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ICU ఖర్చులు, క్యాన్సర్ చికిత్సలు, సంక్లిష్టమైన సర్జరీలు సామాన్య, మధ్యతరగతి ఫ్యామిలీస్ జీవితకాలపు సేవింగ్స్ క్షణాల్లో తుడిచేస్తున్నాయి. ఈ వైద్య ద్రవ్యోల్బణ భయాన్ని ఆసరాగా చేసుకుని ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పుడు ఒక కొత్త అస్త్రాన్ని మార్కెట్లోకి తెచ్చాయి. అదే అన్‌లిమిటెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్. ఇన్‌ఫినిట్ రీఫిల్, అన్‌లిమిటెడ్ రీఛార్జ్, 100% రీస్టోర్ బెనిఫిట్ లాంటి ఆకర్షణీయమైన పేర్లతో ఈ పాలసీలను అమ్ముతున్నారు. అయితే ప్రకటనల్లో కనిపించే ఈ అన్‌లిమిటెడ్ వెనుక ఉన్న అసలు రూల్స్ అండ్ కండిషన్స్ ఏమిటో పాలసీ కొనటానికి ముందే క్షుణ్ణంగా తెలుసుకోవడం కీలకం.
రీస్టోరేషన్ బెనిఫిట్ అంటే ఏమిటి?
చాలామంది అన్‌లిమిటెడ్ అనగానే ఎంత బిల్లు అయినా కంపెనీ కట్టేస్తుందని అనుకుంటారు. కానీ ఇక్కడ అసలు మ్యాజిక్ 'రీస్టోరేషన్' అనే నిబంధనలో ఉంది. ఉదాహరణకు మీరు రూ.10 లక్షల పాలసీ తీసుకున్నారనుకుందాం. ఒక సర్జరీకి రూ.8 లక్షలు ఖర్చయితే.. పాలసీలో రూ.2 లక్షలు మిగులుతాయి. ఆ తర్వాత మరోసారి హాస్పిటల్‌లో చేరినప్పుడు కంపెనీ మీ పాత కవరేజీని మళ్లీ రూ.10 లక్షలకు పెంచుతుంది. ఈ రీఫిల్ అయ్యే ప్రక్రియ అన్‌లిమిటెడ్ సార్లు జరుగుతుందని కంపెనీలు చెబుతాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ దాగి ఉంది. కొన్ని కంపెనీలు మొదటి రూ.10 లక్షలు పూర్తిగా అయిపోతేనే రీస్టోర్ చేస్తాయి. అంటే రూ.8 లక్షలు ఖర్చయి, రూ.2 లక్షలు మిగిలి ఉన్నప్పుడు ఈ రీస్టోర్ బెనిఫిట్ యాక్టివేట్ అవ్వదనమాట.
ఒకే వ్యాధికి వర్తిస్తుందా? లేదా?
ఈ అన్‌లిమిటెడ్ రీఫిల్ పాలసీల్లో అత్యంత కీలకమైన రూల్ వ్యాధి రకం. చాలా కంపెనీలు ఒకే సంవత్సరంలో ఒకే వ్యాధికి మళ్లీ మళ్లీ రీస్టోరేషన్ ఇవ్వవు. ఉదాహరణకు మొదటిసారి గుండె జబ్బుకు క్లెయిమ్ చేసి, రెండోసారి కిడ్నీ సమస్యతో హాస్పిటల్‌లో చేరితేనే ఈ రీస్టోర్ రూల్ వర్తిస్తుంది. ఒకవేళ రెండోసారి కూడా గుండె జబ్బు సమస్యతోనే చేరితే కొన్ని కంపెనీల పాలసీలు క్లెయిమ్ నిరాకరిస్తాయి. ఇప్పుడొస్తున్న లేటెస్ట్ పాలసీలు ఒకే వ్యాధికి ఇస్తున్నప్పటికీ, వాటి ప్రీమియంలు భిన్నంగా ఉంటాయి.
వెయిటింగ్ పీరియడ్.. మినహాయింపులు
అన్‌లిమిటెడ్ పాలసీలు తీసుకున్నంత మాత్రాన మొదటి రోజు నుంచే అన్ని రోగాలకు ఉచిత వైద్యం అందదు. IRDAI రూల్స్ ప్రకారం.. సాధారణ వ్యాధులకు 30 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. బీపీ, షుగర్ వంటి ముందే ఉన్న రోగాలకు 36 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అలాగే క్యాటరాక్ట్, హెర్నియా, జాయింట్ రీప్లేస్‌మెంట్ వంటి వాటికి ఒకటి లేదా రెండేళ్ల ప్రత్యేక పరిమితులు ఉంటాయి. కాస్మెటిక్ సర్జరీలు, డెంటల్ ట్రీట్‌మెంట్ వంటి మినహాయింపులు పాలసీలకు వర్తిస్తాయి.
రూమ్ రెంట్ క్యాపింగ్.. కో-పేమెంట్
పాలసీ అన్‌లిమిటెడ్ అయినా హాస్పిటల్ రూమ్ రెంట్‌పై పరిమితులు ఉండవచ్చు. మీ పాలసీ రోజుకు రూ.5వేలు రూమ్ రెంట్‌కు అనుమతించి.. మీరు రూ.10వేల రూమ్ తీసుకుంటే.. కేవలం రూమ్ రెంట్ మాత్రమే కాదు.. డాక్టర్ ఫీజు, ఆపరేషన్ థియేటర్ ఖర్చులు కూడా ప్రొపోర్షనేట్‌గా తగ్గిపోతాయి. దీనివల్ల మీరే భారీగా సొంత డబ్బు కట్టాల్సి వస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్ పాలసీలలో ఉండే 20% కో-పేమెంట్ నిబంధన కూడా ఈ అన్‌లిమిటెడ్ ప్లాన్స్‌లో కొనసాగవచ్చు.
IRDAI రూల్స్ ఏం చెబుతున్నాయి?
భారత బీమా నియంత్రణ మండలి(IRDAI) వినియోగదారుల రక్షణ కోసం ఎన్నో చట్టాలు తెచ్చినప్పటికీ.. అన్‌లిమిటెడ్ రీస్టోరేషన్ అనే పదానికి ఒకే రకమైన ప్రామాణిక నిర్వచనాన్ని కేటాయించలేదు. దీనివల్ల ఒక్కో ఇన్సూరెన్స్ కంపెనీ తమకు నచ్చినట్లుగా రూల్స్ డిజైన్ చేసుకుంటున్నాయి. ప్రకటనలు మిమ్మల్ని ఆకర్షించడానికి సులభంగా ఉంటాయి. కానీ పాలసీ డాక్యుమెంట్స్ లీగల్ భాషతో కఠినంగా ఉంటాయి. అందుకే హాస్పిటల్‌లో చేరినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలంటే.. పాలసీ కొనేముందే ఆ పేజీల వెనుక ఉన్న కండిషన్స్ అప్లై అనే మాటకు అర్థం పూర్తిగా చదవడం ఎంతో ముఖ్యం.
