
హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ రీవాల్యుయేషన్తో నష్టపోయిన స్టూడెంట్లకు న్యాయం ఎలా చేయాలనే దానిపై ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. రీ వాల్యుయేషన్ కోసం అనుమతి ఇవ్వాలని సర్కారుకు లేఖ రాసే యోచనలో ఉంది. ఇంటర్ సెకండియర్ స్టూడెంట్ సంహిత ఇష్యూలో కామర్స్ లో 97 మార్కులకు గానూ 77 మార్కులే వేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీన్ని సరిదిద్దేందుకు ఇంటర్ బోర్డు శనివారం చర్యలు చేపట్టింది. నిజామాబాద్ జిల్లాలో పేపర్ వాల్యుయేషన్ జరిగిందని ఇంటర్ బోర్డు గుర్తించింది. స్టూడెంట్ రాసిన ఒరిజినల్ ఆన్సర్ షీట్ ను తెప్పించి, ముగ్గురు సబ్జెక్టు ఎక్స్ పర్ట్స్ తో వేర్వేరుగా వాల్యుయేషన్ చేయించారు.
దీంట్లో దాదాపు ముగ్గురు 96–97 మార్కులే వేశారు. ఈ క్రమంలో ఎగ్జామినర్, స్ర్కూటినైజర్ ను ఇంటర్ బోర్డుకు పిలిపించి వివరణ తీసుకున్నారు. సంహితతో పాటు పలువురు విద్యార్థుల మార్కుల విషయంలోనూ ఇలాంటి తప్పిదాలే జరిగాయని ఇంటర్ బోర్డు దృష్టికి వచ్చింది. వారందరికి ఎలా న్యాయం చేయాలనే దానిపై ఇంటర్ బోర్డు సమాలోచనలు చేస్తోంది. ప్రస్తుతం విద్యార్థులకు రీకౌంటింగ్, రీవేరిఫికేషన్ చేసుకునే అవకాశం మాత్రమే ఉంది.
అంటే.. ఇప్పటికే వాల్యుయేషన్ చేసిన ఆన్సర్ షీటులో వచ్చిన మార్కులను లెక్కించడం, అన్ని క్వశ్చన్లకు మార్కులు వేశారా లేదా.. వేయకపోతే వేయడం మాత్రమే చేస్తారు. కానీ, ఒక సారి వాల్యుయేషన్ చేసిన ఆన్సర్ ను మరోసారి చేసే అవకాశం లేదు. దీంతో సంహితకు తిరిగి 97 మార్కులు వేసే అంశం ఇబ్బందిగా మారింది. దీనిపై ఏం చేయాలనే దానిపై సర్కారుకు ఇంటర్ బోర్డు లేఖ రాయాలని నిర్ణయించింది. సర్కారు నిర్ణయం ప్రకారం ముందుకు పోవాలని భావిస్తోంది.