ఆధ్యాత్మికం: జ్ఞానం ఎలా కలుగుతుంది.. అర్జునుడికి.. శ్రీకృష్ణుడు చేసిన నిర్దేశం ఇదే..!

ఆధ్యాత్మికం: జ్ఞానం ఎలా కలుగుతుంది.. అర్జునుడికి.. శ్రీకృష్ణుడు చేసిన నిర్దేశం ఇదే..!

జ్ఞానం ఏ విధంగా పొందాలనే అనే అంశాలని చెప్పిన కృష్ణుణ్ణి అర్జునుడు ఈ విధంగా ప్రశ్నించాడు. అసలేం చెయ్యాలో తెలియకుండా ఉన్నవాడికి ఒక్క మాటలో పరిష్కారం సూచించకుండా వివరంగా యోగసిద్ధాంతాలను చెప్తున్నాడు కృష్ణుడు. అందుకే "నేనేం చెయ్యాలో కర్తవ్య నిర్దేశం చేయమన్నాను. కానీ, విషయాలని వివరించమని అడగలేదు. ఒక పక్క కర్మలని సన్యసించమని, మరొక పక్క కర్మలని ఆచరిస్తూ యోగసిద్ధిని పొందమని రెండు మార్గాలు చెప్పావు. అవి రెండూ మంచివి, గొప్పవి కావచ్చు. వాటిలో ఒకదానిని నువ్వు బాగా నిశ్చయించి నిర్దేశం చెయ్యి అన్నాడు. 

 అర్జునుడి మానసిక స్థితి  కృష్ణుడికి బాగా తెలుస్తుంది. యుద్ధం చెయ్యమని చెప్పటం లేదు. వద్దని చెప్పటం లేదు. అర్జునుడే నిర్ణయించుకోగలిగితే ఈ పాటికి యుద్ధం మొదలై ఉండేది. లేదా అర్జునుడు అంతఃపురంలో ఉండేవాడు. కనుక ఆలస్యం కాకుండా, చర్చలు చెయ్యకుండా చెప్పమని అడిగాడు. అంటే బాధ్యత తన మీద కాక కృష్ణుడి మీద వెయ్యటం ..ఈ గుణం చాలామందిలో ఉంటుంది. కానీ, కృష్ణుడు ఇటువంటి వారితో ఎలా ఉండాలో తెలిసినవాడు. మనసుకి పట్టే విధంగా చెప్పాడు.

కర్మన్యాసయోగం.. కర్మయోగం రెండూ గొప్ప మార్గాలే. నిశ్రేయశాన్ని ప్రసాదిస్తాయి. ఇంతకంటే కావలసిన, పొందదగిన మేలు మరొకటి లేదు అనిపించే స్థితిని నిశ్రేయసం అంటారు. సాధారణంగా ఈ మాటని ముక్తికి వాడతారు. ఎవరైనా చివరికి పొందాలని అనుకునేది అదేగా. రెండిటిలో ఒక దానిని నిశ్చయించి చెప్పాలంటే కర్మయోగమే గొప్పది. కర్మాచరణం చిత్తశుద్ధిని కలిగిస్తుంది. 

మాకు కావలసినంత చిత్తశుద్ది ఉంది అని అంటే  ప్రశ్న ఎందుకు పుడుతుంది? ఏది చెయ్యాలి? ఏది చెయ్య కూడదు? ఏది మంచి పని? ఏది దుష్కర్మ? అనే మీమాంస ఉండదు. కనుక చెయ్యటం మొదలు పెడితే అది మంచి కాకపోయినా, మంచిది అని త్రికరణశుద్ధిగా నమ్మిచేయటం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. అదెలా? అంటే- నుంచి చెడు అని పనులని నిర్ణయించటం వాటి వల్ల కలిగే ఫలితాన్ని బట్టి కదా. కర్మయోగ మార్గంలో ఫలితానికి ప్రాధాన్యం లేదు. అప్పుడు ఇది మంచి పని, ఇది చెడ్డ పని అని ఎట్లా నిర్ణయించగలం? 

ఎందుకంటే ఒకరికి మంచిది మరొకరికి కాకపోవచ్చు. మరొకరికి చెడ్డగా అనిపించింది ఇంకొకరికి కాకపోవచ్చు. కష్టాలు, బాధలు కలిగించే పనులు చెడ్డవి అనుకుంటారు కొందరు. వాటివల్ల కష్టనష్టాలు దాపురించినా చిత్తశుద్ధి మాత్రం జరుగుతుంది. అది జరిగే పద్ధతిలో కొంచెం మార్పు ఉంటుంది అంతే. కనుక కర్మలాచరించటమే మంచిది అని నా నిర్ణయం అని తేల్చి చెప్పాడు కృష్ణుడు. 

ఈ మాట ఇప్పుడు కాదు ఏడేళ్ళ వయసులో ఇంద్రయాగం చేస్తామని గోపకులు అన్న సందర్భంలో వద్దని చెపుతూ ఎవరి మీదా ఆధారపడకూడదు. ఎవరికి కావలసినవి వారే సాధించుకోవాలి అంటూ 'కర్మమే జీవులకు దైవం బధిపా అంటాడు. అంటే నిష్క్రియాత్వాన్ని,సోమరితనాన్ని భగవంతుడు అంగీకరించడు. 

సృష్టికర్త ఏ ప్రయోజనాన్నీ ఆశించి సృష్టి కార్యాన్ని చేయటం లేదు కదా. కర్మసన్యాసం అంటే పనులు మానటం.... అనుకుంటే... మానిన తరువాత చేసేదేముంది? సోమరితనం తప్ప అనుభవించేది జ్ఞానంకాదు.. పోనీ ఏమీ చెయ్యకుండా ఉండటం సాధ్యమా? పూర్వ సంస్కారాలు ప్రేరేపిస్తూ ఉంటాయి. పనులు భౌతికంగా చెయ్యటం లేదు కాని, మనసు పని చేస్తూనే ఉంది కదా. అప్పుడు మానసికంగా చేస్తున్న వాడు అయ్యాడు. 

యజమాని చెప్పినట్టు చేసే వాటికి పనుల్లోని మంచి చెడ్డలు అంటుకోనట్టే సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మ ఆజ్ఞానుసారం నడుస్తున్నాను అనే సోయి ఉన్నవాడికి మంచి చెడులు లేవు. కర్తవ్య నిర్వహణం మాత్రమే ఉంటుంది. మంచి చెడ్డలని నిర్ణయించే మార్గం కొంచెం దూరం నడిపించి అర్ధంకాని చోట ఎక్కడో విడిచి పెడుతుంది. కర్తవ్య నిర్వహణ చిత్తశుద్ధిని కలిగించి జ్ఞానంలో నిలబెడుతుంది. అదే కర్మయోగం. కనుక అది శ్రేష్ఠం.

సన్యాసయోగం అంటే ఏమిటో తెలియాలంటే అసలు సన్యాసం అంటే ఏమిటో తెలియాలి. కర్మలను సన్యసించిన వాడు సన్యాసి, కర్మలు అంటే మనం చేసే కర్మలు అనే అర్థంలో అది సరిపోతుంది. కానీ, భగవద్గీత పరిభాషలో కర్మలు అంటే -మనచే చేయబడేవి అని అర్థం. వీటిని చేయటం, చేయకపోవటం అన్నది మన చేతుల్లో మన ఇష్టాయిష్టాల్లో లేవు. అనుకున్నవి చేయలేకపోవటం. చేయవద్దు అనుకున్నవి చేయవలసి రావటం అనుభవమే కదా. మన స్వభావాన్ని అనుసరించి ప్రకృతి మన చేత చేయిస్తూ ఉన్నది అనేది సత్యం. అప్పుడు బలవంతాన కర్మలని చేయకుండా ఉన్నా... స్వభావాన్ని సన్యసించటం జరగదు కదా. చేస్తూ పోతుంటే చిత్తశుద్ధి అయినా కలుగుతుంది. 

ఆహారపు అలవాట్లు, వేష భాషలు మనని వదిలి వెళ్ళవు. సన్యాసం తీసుకున్నా బాధ్యతలు పెరుగుతాయేగాని తగ్గవు కర్మలని ఆచరించటం మానటం వల్ల ఫలాలని సన్యసించటం వస్తుందనుకోవటం పొరపాటు. ఏకైక మార్గం- ఫలాపేక్షని విడవటం అభ్యాసం చేస్తూ, సత్కర్మలని ఆచరిస్తూ ఉండటమే. సత్కర్మాచరణతో అహంకార మమకారాలు తగ్గుతాయి. అప్పుడు చిత్తం శుద్ధమవుతుంది. చిత్తశుద్ధితో చేసినది ఏదైనా అద్భుత ఫలితాలనిస్తుంది.

యజమాని చెప్పినట్టు చేసే వాడికి పనుల్లోని నుంచి చెడ్డలు అంటుకోనట్లే సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మ ఆజ్ఞానుసారం నడుస్తున్నాను అనే స్పృహ ఉన్నవాడికి నుంచి చెడులు లేవు. కర్తవ్య నిర్వహణం మాత్రమే ఉంటుంది.

 వెలుగు,లైఫ్​