అందరికీ ఒక రకేం ఐబ్రో షేప్ నప్పదు. ముఖాన్ని బట్టి కనుబొమల షేప్ మారుస్తూ ఉండాలి. లేదంటే ఐబ్రో షేప్ ఎంత బాగున్నా ఏదో వెలితిగా కనిపిస్తుంది. పైగా కళ్ల అందం కూడా పోతుంది. అందుకే ఈసారి ఐబ్రో చేయించుకునేముందు మీ ఫేస్ షేప్‌ని దృష్టిలో ఉంచుకోండి. దానికి తగ్గట్టుగా కనుబొమలని ఇలా షేప్ చేస్తే కళ్ల అందం రెట్టింపు అవ్వడం ఖాయం.
కళ్ల అందంలో కనుబొమలు కీరోల్ ప్లే చేస్తాయి. కళ్లని మరింత అందంగా, ఆకర్షణీయంగా చూపెడతాయి ఇవి. అందుకే ఐ బ్రో షేప్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకోవాలి. ఐబ్రో చేయించుకునేటప్పుడు ఫేస్ షేప్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మన ఫేస్ కి ఎలాంటి ఐబ్రో షేప్ సూట్ అవుతుందో తెలుసుకుని చేయించుకోవాలి. మరి ముఖాకృతిని బట్టి ఏ ఐ బ్రో షేప్ నప్పుతుందంటే..
రౌండ్ ఫేస్
గుండ్రటి ముఖాకృతి ఉన్నవాళ్లకి ఒత్తైన, షార్ప్ కనుబొమలు మంచి లుక్ ఇస్తాయి. అలాగే కనుబొమలు ఫ్లాట్గా కాకుండా వంపులు తిరిగేలా సెట్ చేసుకుంటే ముఖం పొడవుగా కనబడుతుంది. కనుబొమల వంపు వీలైనంత ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. ఐబ్రోస్ అంచుల్లో షార్ప్‌గా ఉంటే మరింత లుక్‌వస్తుంది. రౌండ్ షేప్ వాళ్లు చివర్లు మరీ సన్నగా, మరీ లావుగా లేకుండా చూసుకోవాలి.
స్వ్కేర్
స్వ్కేర్ ఫేస్ వాళ్లు కనుబొమల్ని చిన్నగా అర్థ చంద్రాకారంలా చేయించుకోవాలి. ఐబ్రో రెండు చివర్లు సన్నగా ఉంటే ముఖం చాలా అందంగా ఉంటుంది. ఈ ముఖాకృతి వాళ్లు మరీ పల్చని, మందపాటి ఐబ్రో షేప్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. ముఖం త్రిభుజాకృతిలో ఉంటే కనుబొమలు ఒక లైన్‌లా ఉండాలి. ఐబ్రో చివర మాత్రం కొంచెం వంపు ఉంటే బాగుంటుంది. హార్ట్ షేప్ ఉన్నవాళ్లు నుదురు భాగం చాలా విశాలంగా ఉంటుంది. దాన్ని కవర్ చేయాలంటే కనుబొమలను జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాలి. మొదలు నుంచి చివరి వరకు వంపు వచ్చేలా రౌండ్ వంపు తిప్పితే అందంగా కనిపిస్తుంది. అలాగే ఓవెల్ షేప్లో ముఖం ఉంటే కనుబొమల షేప్ చిన్నగా ఉండాలి. మధ్య భాగం ఒత్తుగా కంటి చివరికి వచ్చేసరికి సన్నగా ఉండాలి.
డైమండ్ షేప్
డైమండ్ ముఖాకృతి ఉన్నవాళ్లు ఎక్కువ వంపు ఉన్న కనుబొమలు బాగుంటాయి. అలాగే సన్నగా, పొడవైన ముఖం కలిగిన వాళ్లకి స్ట్రయిట్ ఐబ్రో బాగా నప్పుతుంది. వీళ్లు ఐబ్రోస్ గుండ్రంగా చేయించుకోవాలనుకుంటే మాత్రం ఆలోచించాల్సిందే. ఎందుకంటే వీరికి ఆ షేప్ ఆకర్షణీయంగా ఉండదు. ముక్కు పొడవుగా ఉంటే ఏ ముఖాకృతి గల వాళ్లకైనా ఎత్తుగా ఉండే ఐబ్రో నప్పదు.
కళ్లని బట్టి
కళ్లు కనుబొమలకు దగ్గరగా ఉండే ఐబ్రోస్ మధ్యభాగం నుంచి పైకి వంపుగా చేసుకోవాలి. లేదంటే రెండూ కలిపిపోయినట్లు మరింత క్లోజ్గా కనబడతాయి. అలాగే కనుబొమల లోపలి ఎడ్జ్లోని వెంట్రుకల్ని తొలగించాలి. చివరిదాకా అలా వంపు తిప్పుతూ తీసేస్తే కళ్లకు, కనుబొమలకు మధ్య దూరం పెరుగుతుంది. దాంతో కళ్లు విశాలంగా కనిపిస్తాయి. కళ్లు వెడల్పుగా దూరంగా ఉంటే ఐబ్రో షేప్ థిక్గా ఉండాలి. ముక్కుకు రెండు వైపులా మొదలుపెట్టి చివర సన్నగా వచ్చే మాదిరి షేప్ చేయాలి. అలాగే ఎటువంటి ఫేస్‌కట్ వారైనా ఐబ్రోస్‌ని సాధ్యమైనంత పొడవుగా ఉంచుకోవడం వల్ల ఆకర్షణీయంగా కనిపించొచ్చు.
ఒత్తుగా పెరగాలంటే
చాలామందికి డిఫరెంట్ ఐబ్రో షేప్స్ ట్రై చేయాలని ఉంటుంది. కానీ.. ఐబ్రో పల్చగా ఉండటంతో ప్రయోగాల జోలికి వెళ్లరు. ఒకవేళ ట్రై చేసినా లుక్ రాదు. అలాంటి వాళ్లు ఈ టిప్స్ ఫాలో అయితే ఒత్తైన ఐబ్రో సొంతం చేసుకోవచ్చు.
కలబంద గుజ్జులో కెరొటిన్ ఉంటుంది. దీన్ని పూతలా ఐబ్రోకి రాసుకుని ఆరాక కడిగితే ఆరోగ్యంగా పెరుగుతాయి. కొబ్బరినూనెలోని పోషకాలు ఐబ్రోని ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. అందుకే తరచూ కొబ్బరినూనెతో ఐబ్రో మసాజ్ చేసుకోవాలి.
ఆముదంలోని మాంసకృత్తులు, ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు కనుబొమల్ని ఆరోగ్యంగా పెంచుతాయి. అందువల్ల రోజూ రాత్రి పడుకునే ముందు ఆముదంతో ఐబ్రో మర్దనా చేయాలి.
ఐబ్రోస్ పలుచగా ఉండేవాళ్లు గుడ్డులోని తెల్లసొనలో కొద్దిగా పాలు కలిపి నెల రోజులపాటు ఐబ్రోస్‌మర్దనా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
పెట్రోలియం జెల్లీ కుదుళ్లకు పోషణనిచ్చి కనుబొమలు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది.

