స్కిన్‌టోన్‌కి నప్పేలా లిప్స్టిక్ రంగులను ఎంచుకోవాలి. అలాకాకుండా నచ్చిన రంగుని పూసేస్తే లుక్ అంతా పోతుంది.
స్కిన్ కలర్‌ని బట్టి మేకప్ ఎంచుకుంటారు చాలామంది. కానీ లిప్స్టిక్ దగ్గరికి వచ్చేసరికి పెద్దగా పట్టించుకోరు. కానీ ఆ పొరపాటే లుక్‌ని చెడగొడుతుంది. అలాకాకుండా ఉండాలంటే స్కిన్ టోన్‌ని బట్టి, పెదవుల సైజుని బట్టి ఇలా పెదవులకు రంగులేయండి.
సైజుని బట్టి
పెదవుల సైజ్‌ని బట్టి కూడా లిప్‌స్టిక్ రంగుల్లో మార్పులు చేయాలి. పై పెదవి పెద్దగా ఉంటే.. బ్రైట్ కలర్ కింద పెదవికి వేసి.. అందులోనే ఇంకాస్త డార్క్ కలర్‌ని పై పెదవికి వేయడం వల్ల పెదవులు రెండు ఒకేలా కనిపిస్తాయి. కింద పెదవి లావుగా ఉంటే.. ఏ రంగులనైనా ఎంచుకోవచ్చు. కాకపోతే పై పెదవికి మధ్యలో కాస్త లైట్ చేస్తే మరింత బాగా కనిపిస్తాయి పెదవులు.
రెండు పెదవులు బొద్దుగా ఉంటే.. మెరిసే పెదవుల రంగు మరింత బాగుంటుంది. పెదవులే కాదు.. దంతాల రంగు కూడా ఇక్కడ మ్యాటరంటున్నారు బ్యూటీషియన్లు. తెల్లటి పలువరస ఉంటే ఎలాంటి రంగులైనా పర్వాలేదు. అదే పళ్లు పచ్చగా ఉంటే మాత్రం.. రోజ్, ఆరెంజ్, లైట్ రెడ్ కలర్స్ వేసుకోవచ్చు. పర్పుల్, బ్రౌన్, రెడ్ షేడ్స్‌కి దూరంగా ఉండాలి.
రంగుల ఎంపిక
స్కిన్ టోన్ బట్టి లిప్‌స్టిక్ రంగు ఎంచుకోవాలి. ఫెయిర్‌గా ఉంటే.. దాదాపు అన్ని రంగులూ సూటవుతాయి. కానీ అన్నిటికంటే.. లైట్ పింక్, కోరల్, పీచ్, న్యూడ్, డస్టీ రెడ్ కలర్స్ ఏవైనా బాగుంటాయి. గోల్డ్ మెటాలిక్ కలర్స్‌ను ట్రై చేయొచ్చు. లైట్ కలర్‌లో ఉండే అమ్మాయిలు కూడా ఇవే రంగులను ట్రై చేసి మరింత అందంగా కనిపించొచ్చు. మీడియం తెలుపు రంగులో ఉండే అమ్మాయిలయితే.. రోజ్, బెర్రీ, చెర్రీ రెడ్ రంగులు పెదవులను మరింత ఆకర్షణీయంగా చూపిస్తాయి. కాస్త రంగు తక్కువ ఉన్నవాళ్లు.. రాక్ కోరల్, డీప్ పింక్, బ్రైట్ రెడ్ వేసుకోవచ్చు. బ్రౌన్, పర్పుల్ షేడ్స్ జోలికి వెళ్లకపోవడం మంచిది. దీనివల్ల వీళ్లు మరింత నల్లగా కనిపిస్తారు. డీప్ కలర్ ఉన్నవాళ్లు.. బ్రౌన్, పర్పుల్ షేడ్స్ ఏవైనా ట్రై చేయొచ్చు. కారమిల్, వైన్ రంగులో ఉండే లిప్‌స్టిక్ వీరిని ప్రత్యేకంగా చూపిస్తాయి.
పాలిపోయిన పెదాలకు మెరుగులద్దేందుకు పేస్టల్ , లైట్ షేడ్ లిప్‌స్టిక్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ రకం స్కిన్ ఉన్నవాళ్లు బ్రౌన్, రెడ్, మెరూన్ వంటి డార్క్ కలర్స్ వాడొద్దు. పేల్ స్కిన్‌టోన్ కలిగిన వాళ్లకు మెటాలిక్ లిప్‌స్టిక్ సరిపడదు. మరింత పేల్గా కనబడేలా చేస్తుంది
మిడిల్ ఏజ్‌లో ముదురు రంగులొద్దు
లిప్‌స్టిక్‌ని బాగా ఇష్టపడేవాళ్లు ఎక్కువగా డార్క్ కలర్సే ఎంచుకుంటారు. కానీ డార్క్ కలర్స్ చిన్న వయసులో నప్పినంతగా మిడిల్ ఏజ్ వాళ్లకు నప్పవు. వయసు పెరుగుతున్న కొద్దీ పెదాల్లో ఉండే కొల్లాజన్ తగ్గిపోతుంది. దీనివల్ల పెదవులకు సాగే గుణం తగ్గిపోతుంది. టీనేజ్‌లో ఉన్నట్టు పెదవులు నిండుగా ఉండవు. సన్నగా మారిన మీ పెదవులపై ముదురు రంగులు అద్దుకుంటే మీ స్మైల్ లైన్స్ స్పష్టంగా కనిపిస్తాయి. కనుక లేత రంగులు, న్యూడ్స్ లేదా పింక్ రంగులు వాడి పెదవులు నిండుగా కనిపించేటట్టు చేయొచ్చు. మిడిల్ ఏజ్‌లో డార్క్ కలర్స్ జోలికెళ్లొద్దు.
