- క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి సీఈఓల వరకు అందరి డేటా అప్‌లోడ్
- మూడు దశల్లో పరిశీలన.. తుది ధ్రువీకరణ తర్వాతే లాక్
- పదోన్నతులు, బదిలీల్లో జాప్యానికి చెక్.. పారదర్శకతే లక్ష్యం
- ఈ నెల 31లోగా పూర్తి చేయాలని ఆదేశాలు
పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి జిల్లాస్థాయి ఉన్నతాధికారుల వరకు అందరి సర్వీస్ వివరాలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్‌ఆర్‌ఎంఎస్(హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) పోర్టల్‌ను ఆధునీకరించి, ఉద్యోగుల పూర్తి సమాచారాన్ని ఈ నెల 31లోగా నమోదు చేయాలని ఆదేశించింది. ఈ ప్రక్రియతో పదోన్నతులు, బదిలీలు, వేతన సవరణలు, రిటైర్మెంట్ ప్రయోజనాల్లో జాప్యం తగ్గడంతో పాటు శాఖలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్ సిబ్బంది వివరాలను ప్రభుత్వం ఆన్లైన్ చేయనుంది. 2019లో ప్రారంభించిన హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(ఈహెచ్‌ఆర్‌ఎంఎస్) మాడ్యూల్‌ను మరింత ఆధునీకరించి, ఉద్యోగుల సమాచారాన్ని సమగ్రంగా అందుబాటులోకి తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది.
ఈ మేరకు జిల్లాల పరిషత్ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారుల(డీపీవో)కు మార్గదర్శకాలు జారీ చేసింది. నమోదు ప్రక్రియ మొత్తాన్ని ఈ నెల 31 నాటికి ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తిచేయాలని అన్ని జిల్లాల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. జూనియర్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, గ్రేడ్ 1 నుంచి 4 వరకు ఉన్న పంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓలు, ఎంపీడీఓలు, డీఎల్‌పీఓలు, డీపీఓలు, డిప్యూటీ సీఈఓలు, సీఈఓల పూర్తి వివరాలను అప్‌లోడ్ చేయనున్నారు.
సర్వీస్ రికార్డులు, విద్యార్హతలు, కుల-మత వివరాలు, ప్రస్తుత హోదా, పనిచేస్తున్న ప్రాంతం వంటి అంశాలను పక్కాగా నిక్షిప్తం చేస్తారు. దీని ద్వారా పదోన్నతులు, బదిలీలు, వేతన సవరణలు, రిటైర్మెంట్ ప్రయోజనాల ప్రక్రియల్లో జాప్యాన్ని నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అంతేగాకుండా శాఖాపరమైన సమాచారంలో పారదర్శకత పెంచడంతో పాటు తప్పుడు వివరాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఆఫీసర్లు చెబుతున్నారు.
మూడు దశలుగా సమాచార సేకరణ..
ఉద్యోగికి సంబంధించిన ప్రాథమిక, వ్యక్తిగత, సర్వీస్ వివరాలను పోర్టల్‌లో ఎంటర్ చేస్తారు. నమోదు చేసిన వివరాలను సర్వీస్ రిజిస్టర్ ఆధారంగా సంబంధిత అధికారి సరిచూసి ఆమోదిస్తారు. పైఅధికారి ఆ వివరాలను తుది తనిఖీ చేసి సిస్టమ్‌లో లాక్ చేయనున్నారు. జూనియర్, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, గ్రేడ్ 1 నుంచి 4 పంచాయతీ కార్యదర్శుల వివరాలను ఆయా ఉద్యోగులే నమోదు చేస్తారు. వీటిని మండల పంచాయతీ అధికారి పరిశీలించగా.. జిల్లా పంచాయతీ అధికారి ధ్రువీకరించనున్నారు.
ఎంపీఓ వివరాలను డివిజనల్ పంచాయతీ అధికారి పరిశీలించనున్నారు. ఎంపీడీఓల వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేకంగా సీఈఓ కార్యాలయంలో సీఈఓ అసిస్టెంట్ ను నియమిస్తారు. సీఈఓ పరిశీలించిన అనంతరం డిప్యూటీ కమిషనర్ ధ్రువీకరిస్తారు. డీపీఓ, డిప్యూటీ సీఈఓ, సీఈఓల వివరాల నమోదు కోసం సీఈఓ అసిస్టెంట్, డీపీఓ అసిస్టెంట్లు బాధ్యులుగా వ్యవహరిస్తారు.
సచివాలయ స్థాయిలోని డిప్యూటీ కమిషనర్(అడ్మిన్) వీటిని తుది ధ్రువీకరణ చేయనున్నారు. కాగా, ఉద్యోగులు పోర్టల్‌లో నమోదు చేసే సమాచారం పక్కాగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది. సమాచారం సరిగ్గా ఉందంటూ ఉద్యోగి ఆన్‌లైన్‌లో స్వయం ధ్రువీకరణ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ తప్పుడు వివరాలు నమోదు చేసినట్లు తేలితే సంబంధిత ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్‌శాఖ హెచ్చరించింది.
