శ్రావణ మాసం.. రద్దీగా పూల మార్కెట్లు

శ్రావణ మాసం.. రద్దీగా పూల మార్కెట్లు

పండుగలు వచ్చాయంటే పూజలకు పూలు ఎక్కువగా వాడతారు. అందుకే పూలకు ఫుల్ డిమాండ్ ఉండడంతో పాటు రేట్లు పెరుగుతాయి. ప్రస్తుతం గుడిమల్కాపూర్ మార్కెట్ కి బెంగళూరు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి పూలు దిగుమతి అవుతున్నాయి. శ్రావణ మాసం రావడంతో పూలమార్కెట్లు రద్దీగా మారాయి. హైదరాబాద్ సిటీ మార్కెట్ కు  బెంగళూరు  నుంచి తెల్ల చామంతి, రోజాలు, బొకే ఫ్లవర్స్ వస్తున్నాయి. చేవెళ్ల, కదిరి నుంచి కనకాంబరాలు, చేవెళ్ల, శంషాబాద్, శామీర్ పేట, ఏపీలోని రాజమండ్రి నుంచి పూలు దిగుమతి అవుతున్నాయి. గుడిమల్కాపూర్ మార్కెట్ కు బంతి, చామంతి, లిల్లీ పూలు వస్తున్నాయి. టైగర్ రోజ్, సెంట్ రోజ్, కలర్ రోజ్ పూలు నిన్నటి దాకా కేజీ రూ. 30 దాకా ఉండేవి. ఇప్పుడు రూ. 60 నుంచి రూ. 80 పలుకుతున్నాయి.

కేజీ రూ. 50 ఉండే లిల్లీ పూలు...రూ. 130 నుంచి రూ. 180 దాకా ఉన్నాయి. నెల రోజులుగా కనకాంబరాలు కేజీ రూ. 300 దాకా ఉండేవి. కానీ ఇప్పుడు రూ. 550 నుంచి రూ. 650దాకా పలుకుతున్నాయి. చామంతి రేటు కూడా పెరిగింది. కేజీ రూ. 200, సన్నజాజులు రూ. 500 నుంచి రూ. 600 దాకా ఉన్నాయి. శ్రావణ మాసంతో పండుగల సీజన్ స్టార్ట్ అవుతుందనీ... అందుకే పూల రేట్లు పెరిగాయని వ్యాపారులు వెల్లడిస్తున్నారు. ఈ నెల నుంచి తమకు గిరాకీ బాగుంటుందని చెబుతున్నారు. గత వారం కంటే ఇప్పుడు పూల రేట్లు అధికమయ్యాయని ప్రజలు వెల్లడిస్తున్నారు. అయినా పూజల కోసం కొనక తప్పడం లేదని చెబుతున్నారు. శ్రావణ శుక్రవారం కావడంతో పూజ సామాన్లన్నీ ఇక్కడే దొరుకుతాయని అందుకే గుడిమల్కాపూర్ మార్కెట్ వచ్చామంటున్నారు. హైదరాబాద్ సిటీలోని మార్కెట్లన్నీ పూల కొనుగోళ్ళతో బిజీగా మారాయి.