బోరబండలో భారీ శబ్దాలు..భూకంపం భయంతో రోడ్లపైకి జనం

బోరబండలో భారీ శబ్దాలు..భూకంపం భయంతో రోడ్లపైకి జనం
  •   భూకంపం కాదన్న ఎన్జీఆర్‌ఐ ఆఫీసర్లు
  •   2017లోనూ ఇలాగే సౌండ్స్​ వచ్చాయంటున్న స్థానికులు

హైదరాబాద్, వెలుగు: భూకంపం పుకార్లు హైదరాబాద్‌ బోరబండలో శుక్రవారం రాత్రి కలకలం రేపాయి. బోరబండ, రెహమత్ నగర్,అల్లాపూర్ ఏరియాల్లో రాత్రి 8:30 గంటల టైమ్‌లో పెద్ద శబ్దాలు రావడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు ఉరికారు. భయంతో అర్ధరాత్రి వరకు రోడ్లపైనే ఉన్నారు. సమాచారం తెలిసిన జూబ్లీహిల్స్ పోలీసులు స్పాట్‌కి వచ్చి ఆరా తీశారు. నేషనల్‌ జియలాజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎన్జీఆర్‌ఐ) ఆఫీసర్లతో కలిసి సౌండ్స్ వచ్చిన ఏరియాలు పరిశీలించారు. అయితే భూకంపం వచ్చినట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదని ఎన్జీఆర్‌ఐ టీమ్‌ తెలిపింది. స్థానికుల నుంచి వివరాలు సేకరించి అది భూకంపం కాదని తేల్చారు. భూమి పోరల్లో సర్దుబాట్ల వల్లనే సౌండ్స్ వస్తున్నట్లు గుర్తించారు. బోరబండ ఏరియా భూమి రాళ్ల ప్రాంతామని అప్పుడప్పుడు భూమిలో పొరల సర్దుబాటు కారణంగా ఇలాంటి శబ్దాలు వస్తున్నట్లు చెప్పారు. 2017లో కూడా ఇలాంటి శబ్దాలు వచ్చినట్లు స్థానికులు చెప్పారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌, జూబ్లీహిల్స్ ఇన్స్ స్పెక్టర్ సత్తయ్య ఏరియాలో పర్యటించి భూకంపం పుకార్లు నమ్మవద్దని స్థానికులకు ధైర్యం చెప్పారు.