V6 News

Humanoid Robot: ఉసేన్ బోల్ట్కి పోటీగా రోబో.. 100 మీటర్ల రికార్డు బ్రేక్ చేసే దిశగా పరుగు

Humanoid Robot: ఉసేన్ బోల్ట్కి పోటీగా రోబో.. 100 మీటర్ల రికార్డు బ్రేక్ చేసే దిశగా పరుగు

Humanoid Robot: ఒక రోబో అచ్చం మనిషిలాగే ట్రాక్‌పై వేగంగా పరిగెత్తడం ఇప్పటి వరకు మనం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోనే చూశాం.. కానీ, ఇప్పుడు అదే నిజమైంది. చైనాకు చెందిన రోబోటిక్స్ సంస్థ 'Unitree' (యూనిట్రీ) అభివృద్ధి చేసిన H1 హ్యూమనాయిడ్ రోబో అద్భుతమైన వేగంతో పరిగెత్తి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.  ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో H1 రోబో సెకనుకు 10 మీటర్ల వేగాన్ని అందుకుంది. ఒక దశలో స్పీడ్-మెజరింగ్ పరికరంలో ఇది 10.1 m/s వేగాన్ని కూడా తాకింది. హ్యూమనాయిడ్ (మనిషి ఆకారం కలిగిన) రోబోల చరిత్రలో ఇది ఒక అద్భుతమైన మైలురాయిగా నిలవనుంది. 

ఉసేన్ బోల్ట్‌తో పోలిక: 
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వ్యక్తి ఉసేన్ బోల్ట్ రికార్డుతో పోలిస్తే ఈ రోబో వేగం చాలా దగ్గరగా ఉంది. ఉసేన్ బోల్ట్ (2009 రికార్డు): సగటు వేగం సెకనుకు 10.44 మీటర్లు (9.58 సెకన్లలో 100 మీటర్లు)గా ఉంది. కానీ H1 రోబో: సెకనుకు 10.1 మీటర్లుగా మాత్రమే ఉంది. అంటే, ఈ రోబో ఇంకా బోల్ట్‌ను మించిపోలేదు కానీ, దాదాపు అతనికి సమానమైన వేగంతో (Ballpark speed) పరిగెత్తగలుగుతోంది.
  
ఈ రోబో ప్రత్యేకత?: 
సాధారణంగా చక్రాలు ఉన్న రోబోలు వేగంగా వెళ్లడం సులభం, కానీ మనిషిలా కాళ్లు ఉన్న రోబోకు అంత వేగం రావడం చాలా కష్టం అవుతుంది. ఈ రోబో బరువు సుమారు 62 కిలోలు ఉంటుంది. దీని తొడ, పిక్కల మొత్తం పొడవు సుమారు 80 సెంటీమీటర్లు. ఇది మనిషి శరీర నిష్పత్తిని పోలి ఉండటం వల్ల, ఇది పెద్ద అడుగులు వేస్తూ స్థిరంగా పరిగెత్తగలుగుతోంది. కాబట్టి, ఈ ప్రయోగాలు కేవలం పరుగు పందాల కోసం మాత్రమే కాదు.. వస్తువులను వేగంగా డెలివరీ చేయడం, ప్రమాదకర ప్రాంతాల్లో వేగంగా వెళ్లి ప్రాణాలను కాపాడటంతో పాటు మనుషుల కంటే వేగంగా, సమర్థవంతంగా కదలగలిగితే ఈ రోబోలని అనేక రంగాల్లో ఉపయోగించవచ్చు అని చెబుతున్నారు. 

సరికొత్త రికార్డు?: 
ప్రస్తుతం రోబోటిక్స్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే కొన్ని రోబోలు 100 మీటర్ల పరుగు పందాలను, హాఫ్ మార్గాన్లను కూడా పూర్తి చేశాయి. విశ్లేషకుల అంచనా ప్రకారం, 2026 మధ్య నాటికి హ్యూమనాయిడ్ రోబోలు 100 మీటర్ల పరుగును 10 సెకన్ల లోపే పూర్తి చేసే అవకాశం ఉంది. అంటే అప్పుడు అవి అధికారికంగా మానవ రికార్డులను సవాల్ చేయగలవు అని పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతానికి పరుగు పందెం విషయంలో మనుషులదే పైచేయి అయినప్పటికీ, మనిషికి, యంత్రానికి మధ్య ఉన్న వ్యత్యాసం చాలా వేగంగా తగ్గిపోతోంది. కొన్ని ఏళ్ల క్రితం అసాధ్యం అనుకున్న వేగాన్ని నేడు రోబోలు అందుకుంటున్నాయి. భవిష్యత్తులో ఒలింపిక్ ట్రాక్‌లపై రోబోలు పరుగు తీయడం మనం చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

►ALSO READ | Rohit Sharma: ఏకంగా స్టేడింయలోనే డ్యాన్స్ చేసిన రోహిత్ శర్మ.. నెట్టింట వీడియో వైరల్

మనుషులని అర్థం చేసుకునే రోబోలు: 

మనిషి రూపం, మనసులోని భావాలను అర్థం చేసుకునే శక్తి, ఎదుటివారితో మాట్లాడే విధానం వంటి అంశాల వైపు రోబోలు అడుగులు వేస్తున్నాయి. హాంకాంగ్‌లో జరిగిన తాజా ప్రదర్శనలో మనుషులని పోలి ఉండే 'హ్యూమనాయిడ్' రోబోలు సందర్శకులను షాక్ కి గురి చేశాయి. చర్మం, కళ్లు, హావభావాలతో ఇవి సరికొత్త సాంకేతిక విప్లవానికి తెరలేపాయి. హాంకాంగ్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ఇటీవల స్టార్ట్ అయినా ప్రదర్శనలో చైనా తన రోబోటిక్ సత్తా చాటింది. అక్కడ కనిపించిన వందకు పైగా రోబోలలో కొన్ని చిన్న పిల్లల పరిమాణంలో ఉండి సందర్శకులతో ముచ్చటించడంతో పాటు పాటలు పాడుతూ, ఇంగ్లీష్, మాండరిన్ భాషల్లో ఈజీగా మాట్లాడాయి. కేవలం యంత్రాల్లా కాకుండా, ఎదుటి వ్యక్తి అడిగే ప్రశ్నలకు ఎంతో తెలివిగా ఆన్సర్స్ ఇచ్చి అందరినీ ఈ రోబోలు ఆకట్టుకున్నాయి.