జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అప్పటివరకు కళ్ళముందే తిరిగిన కొడుకు అనంతలోకాలకు వెళ్లగా.. ఆ వార్త విన్న తల్లి గుండె తట్టుకోలేకపోయింది. కొడుకు మరణించిన గంటల వ్యవధిలోనే తల్లి కూడా కన్నుమూసిన ఘటన అయిజ మండలం తూముకుంట గ్రామాన్ని శోకసంద్రంలో ముంచేసింది.
గ్రామానికి చెందిన కుర్వ మల్లికార్జున్ (మల్లన్న) తీవ్రమైన వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయాడు. కంటిపాపలా పెంచుకున్న కొడుకు ఇక లేడన్న వార్త విన్న తల్లి కురువ రంగమ్మ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు మరణవార్తను ఆమె తట్టుకోలేకపోయింది. పుట్టెడు దుఃఖంతో ఆమె గుండె ఆగిపోయింది. ఒకే ఇంట్లో తల్లీకొడుకులు మృతి చెందడంతో తూముకుంట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది.

