లష్కర్ బోనం ధూమ్..ధామ్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి భక్తిశ్రద్ధలతో బోనాలు  

లష్కర్ బోనం ధూమ్..ధామ్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి భక్తిశ్రద్ధలతో బోనాలు  
  • లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనం 
  • అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి 
  • ప్రభుత్వం తరఫున 
  • బంగారు బోనం సమర్పించిన మంత్రి పొన్నం దంపతులు 
  • అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు

హైదరాబాద్ సిటీ, పద్మారావు నగర్/ వెలుగు:  సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 4.05 గంటలకు ప్రభుత్వం తరఫున హైదరాబాద్​ ఇన్‌‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనభాగ్యం కల్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మధ్యాహ్నం 12. 45 గంటలకు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎంకు ఆలయ అధికారులు, అర్చకులు  పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి సీఎం రేవంత్​రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. పూజల తర్వాత ఆలయ కమిటీ అధికారులు సీఎంకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీఎంతో పాటు మంత్రులు కొండా సురేఖ, సీతక్క, మాజీ మంత్రి, సనత్​నగర్​ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ ​యాదవ్​అమ్మ వారిని దర్శించుకున్నారు. ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఉదయం నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.  రాంగోపాల్ పేట, ప్యాట్నీ సెంటర్​తో పాటు వివిధ మార్గాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.  

నేడు రంగం

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆషాఢ బోనాల జాతర సందర్భంగా నిర్వహించే ‘రంగం’ (భవిష్యవాణి) సోమవారం ఉదయం 8.30 గంటలకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో మాతంగి స్వర్ణలత(శివసత్తి) పచ్చి మట్టి కుండపై నిలబడి అమ్మవారిని ఆవాహన చేసుకుంటారు. భవిష్యవాణి వినిపించడంతో పాటు పూజారులు, అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. తర్వాత అమ్మవారి ఘటాన్ని ఏనుగు అంబారీపై ఊరేగిస్తూ ‘సాగనంపే’ కార్యక్రమంతో లష్కర్ బోనాల ఉత్సవాలు ముగుస్తాయి. సాయంత్రం అమ్మవార్ల ఫలహార బండ్ల ఊరేగింపు ఉంటుంది.ప్యాట్నీ సెంటర్, బాటా వైపు క్యూ లైన్లలో భక్తులు భారీగా బారులు తీరారు.

 వీఐపీలకు, సామాన్య భక్తులకు, బోనాలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బోనాల కోసం ఏర్పాటు చేసిన లైన్లలో సాధారణ జనం కూడా రావడంతో అన్ని లైన్లు జనాలతో నిండిపోయాయి. ముఖ్యంగా ఒక్క బోనం వెంట ఒక్కరూ మాత్రమే రావాలని పోలీసులు, ఆలయ అధికారులు చెప్పినా ఒక్కో బోనం వెంట 10 నుంచి 15 మంది తరలిరావడంతో లైన్లు కిక్కిరిసిపోయాయి. అమ్మవారి దర్శనానికి దాదాపు 6 గంటలకుపైగా సమయం పట్టింది. ఆలయం చుట్టు పక్కల దాదాపు 10కి పైగా ప్రాంతాల్లో వెహికల్ పార్కింగ్స్ ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానికి  వచ్చే భక్తులకు దారి వెంట తాగునీరు ఏర్పాటు చేశారు. పారిశుధ్య సిబ్బందితో ఎప్పటికప్పుడు ఆలయ పరిసర ప్రాంతాలను నిరంతరం శుభ్రం చేయించారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది దశలవారీగా విధులు నిర్వర్తించారు. ఆలయ పరిసరాల్లో ఎలాంటి  అవాంఛనీయ సంఘటనలు  తలెత్తకుండా పోలీస్ శాఖ  భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షించారు. ఆలయ ఆవరణలో ఫైర్ ఇంజన్, అంబులెన్స్ ను సిద్ధంగా ఉంచారు. 

అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు.. 

ఉదయం దర్శనాలు ప్రారంభం కాగానే సామాన్య భక్తులతో పాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 10 గంటల తర్వాత వీవీఐపీల రాకతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా అమ్మవారి దర్శనానికి క్యూ కట్టారు.

పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు  వద్దిరాజు రవిచంద్ర,  ప్రభుత్వ సలహాదారు వీ. హనుమంతరావు, ఎమ్మెల్యేలు  దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్,  నవీన్ యాదవ్,  శ్రీగణేష్, బీఆర్‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్ రెడ్డి,  జగదీశ్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, మల్లారెడ్డి, సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆల ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవాలయ  చైర్మన్ రామేశ్వర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు,  సికింద్రాబాద్ ఆర్డీవో సాయిరాం, ఈవో  మనోహర్ రెడ్డి, విద్యుత్,  జీహెచ్ఎంసీ, హెచ్ఎమ్ డబ్ల్యూ ఎస్ ఎస్, మెడికల్, ఫైర్, పోలీస్ తదితర శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించారు.

శివసత్తుల ఆగ్రహం..

బోనాల సందర్భంగా ఆలయాల వద్ద పోలీసుల వైఖరిపై శివసత్తులు, జోగినులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిష్టతో బోనాలు ఎత్తుకొని దర్శనానికి వచ్చిన తమను పోలీసులు నెట్టివేయడం, తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. పండుగ సందర్భంగా తమ వద్ద ఉన్న బోనాలు పడిపోయాయని కొందరు శివసత్తులు కన్నీరుమున్నీరయ్యారు. శివసత్తుల కోసం ప్రత్యేక పాస్‌లు, సదుపాయాలు కల్పిస్తామని చెప్పి నిర్లక్ష్యం వహించారని ధ్వజమెత్తారు. బోర్డు మెంబర్లుగా లేదా ఉత్సవ కమిటీల్లో శివసత్తులకు భాగస్వామ్యం కల్పించకపోవడం వల్లే ఏటా ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్‌‌కు ఘన స్వాగతం

మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక ఆహ్వానం మేరకు విచ్చేసిన అమెరికా కాన్సుల్ జనరల్ లారా ఈ. విలియమ్స్  అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. ఆమెకు మంత్రి ఘన స్వాగతం పలికి ఆలయ విశిష్టత, బోనాల పండుగ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యతతో పాటు ప్రసిద్ధ 'రంగం' కార్యక్రమం గురించి వివరించారు. ఈ సందర్శన ద్వారా తెలంగాణ సంస్కృతి అంతర్జాతీయ స్థాయిలో పరిచయం కావడంతో పాటు తెలం గాణ-, అమెరికా మధ్య సాంస్కృతిక సంబంధాలు బలోపేతమవుతాయని మంత్రి పొన్నం పేర్కొన్నారు.

వర్షాలు బాగా పడాలి: మంత్రి కొండా సురేఖ 

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో వర్షాలు బాగా పడి పంటలు సమృద్ధిగా పండాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలన్నారు.

బీఆర్‌‌‌‌ఎస్ హయాంలో వైభవంగా బోనాలు:  కేటీఆర్‌‌‌‌ 

తెలంగాణ రాష్ట్రం సాధించింది మహంకాళి అమ్మవారి ఆశీస్సులతోనేనని కేసీఆర్ చెప్పి బంగారు బోనం సమర్పించడం బీఆర్‌‌‌‌ఎస్ హాయంలోనే ప్రారంభమైందని కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో 25 కోట్లు ఇచ్చి హైదరాబాద్ లో అన్ని ఆలయాలకు బోనాల పండుగ ను బీఆర్‌‌‌‌ఎస్ సర్కార్ వైభవంగా చేసిందని గుర్తుచేశారు. 

 సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో అమ్మవారికి మట్టి బోనం

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకల సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి విభాగం ఆధ్వర్యంలో అమ్మవారికి వైభవంగా మట్టి బోనం సమర్పించారు. రాష్ట్రంలోని 32 జిల్లాలకు చెందిన 175 మంది మహిళా కళాకారులు ఆధ్యాత్మిక శోభతో తరలివచ్చి ఆదివారం అమ్మవారికి ఈ బోనాన్ని చెల్లించారు. డప్పు చప్పుళ్లతో సంప్రదాయబద్ధంగా సాగిన ఈ బోనాల ఊరేగింపు అందరిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌‌పర్సన్ డాక్టర్ జీవీ వెన్నెల మాట్లాడుతూ.. 19వ శతాబ్దంలో విరుచుకుప డిన ప్లేగు, కాలరా వంటి మహమ్మారి అంటువ్యాధులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దివ్య ఆశీస్సులతోనే నయమయ్యాయని, ప్రజలకు అమ్మవారే కొండంత అండగా నిలిచారని గుర్తుచేశారు. గ్రామ దేవతలను భక్తి శ్రద్ధలతో కొలుచుకునే తెలంగాణ బోనాల పండుగ ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఆధ్యాత్మిక వేడుక అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలంతా ఆయురారో గ్యాలు, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ గత ఏడాది నుంచి సారథి కళాకారులం దరం కలిసి మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నామని వెన్నెల వివరించారు.