- రాబోయే 15 ఏండ్లలో పది రెట్లు పెరగనున్న అవయవాల కొరత
- 2040 నాటికి భారీగా డిమాండ్
- ఏటా 1.43 లక్షల కిడ్నీలు,
- 2.10 లక్షల లివర్లు, 95 వేల హార్ట్స్, 12 వేల లంగ్స్ అవసరం
- ‘ది లాన్సెట్ రీజినల్ హెల్త్’ జర్నల్ రిపోర్టులో షాకింగ్ విషయాలు
- తెలంగాణ ‘జీవన్ దాన్’పై ప్రశంసలు
- దేశంలో 5 రాష్ట్రాల్లోనే 90 శాతం సర్జరీలు.. ఈశాన్య రాష్ట్రాల్లో శూన్యం
- ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: దేశంలో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం అవయవాల కొరత తీవ్రంగా ఉందని, రాబోయే రోజుల్లో ఈ విషయంలో తీవ్ర సంక్షోభం ఎదురుకానుందని ప్రపంచ ప్రసిద్ధ ‘ది లాన్సెట్ రీజినల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఏసియా’ జర్నల్ హెచ్చరించింది. మరో 15 ఏండ్లలో... అంటే 2040 నాటికి దేశంలో అవయవాల కొరత భయంకర స్థాయికి చేరుతుందని వెల్లడించింది. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్(జీబీడీ) 2021 డేటాతో పాటు అంతర్జాతీయ, నేషనల్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ సంస్థల (జీఓడీటీ, ఎన్ఓటీటీఓ, ఐహెచ్ఎంఈ) వివరాల ఆధారంగా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ హరి శంకర్ మేష్రామ్, డాక్టర్ మనీష్ బల్వానీ, డాక్టర్ వివేక్ కుటే బృందం చేపట్టిన సైంటిఫిక్ రీసెర్చ్ నివేదిక ఈ జర్నల్‌లో ప్రచురితమైంది.
రాబోయే రోజుల్లో ఏటా లక్షలాది మందికి అవయవాలు లభించక ప్రాణాలు కోల్పోయే దుస్థితి దాపురిస్తుందని ఈ రీసెర్చ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. 2021 నాటి లెక్కల ప్రకారం.. దేశంలో ఏటా 1.25 లక్షల మందికి కిడ్నీ మార్పిడి అవసరం ఉండగా, కేవలం 9,105 మందికి (7.2 శాతం) మాత్రమే మార్పిడి జరిగింది. అలాగే 1.84 లక్షల మందికి లివర్ న్స్‌ప్లాంట్ అవసరం కాగా, కేవలం 2,847 మందికి (1.5 శాతం) మాత్రమే చికిత్స అందింది. హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ విషయంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఏటా 83,841 మందికి హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం కాగా, కేవలం 151 మందికి (0.2 శాతం) మాత్రమే జరిగింది. ఇక లంగ్స్ విషయానికొస్తే 11,253 మందికిగానూ కేవలం 133 మందికి (1.2 శాతం) మాత్రమే అవయవాలు లభించాయి. అంటే దేశంలో ఏటా 90 శాతానికి పైగా బాధితులు అవయవాలు దొరక్క ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే, మనదేశంలో కిడ్నీల కంటే లివర్ మార్పిడి అవసరాలే అత్యధికంగా ఉన్నట్లు స్టడీ వెల్లడించింది. దేశంలో క్రానిక్ లివర్ డిసీజ్ (సిర్రోసిస్, ఫ్యాటీ లివర్, లివర్ క్యాన్సర్) బాధితుల సంఖ్య విపరీతంగా ఉండటమే ఇందుకు కారణం. ఆల్కహాల్ వాడకంతో పాటు నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధులు తీవ్రం కావడం వల్ల ఏటా లక్షలాది మంది లివర్ ఫెయిల్యూర్‌కు గురవుతున్నారని తెలిపింది.
తెలంగాణ జీవన్ దాన్ రోల్ మోడల్..
దేశంలో చాలా రాష్ట్రాల్లో అవయవ దానం మందకొడిగా సాగుతుంటే.. మన రాష్ట్రంలో అమలవుతున్న ‘జీవన్ దాన్’ కార్యక్రమం, తమిళనాడులోని డీసీజ్డ్ డోనర్ నెట్‌వర్క్ అద్భుత ఫలితాలను ఇస్తున్నాయని లాన్సెట్ రీసెర్చ్ కొనియాడింది. సరైన మౌలిక వసతులు, ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రజల్లో అవగాహన ఉంటే అవయవ దానంలో ఎంతటి గొప్ప లక్ష్యాలనైనా సాధించవచ్చని చెప్పడానికి తెలంగాణ జీవన్ దాన్ కార్యక్రమం రోల్ మోడల్‌గా నిలిచిందని పేర్కొంది. ఇక నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (ఎన్ఓటీటీఓ) 2024 రిపోర్ట్ ప్రకారం.. దేశంలో జరుగుతున్న మొత్తం అవయవ మార్పిడి సర్జరీలలో 80 నుంచి 96 శాతం ఐదు రాష్ట్రాలలోనే జరుగుతున్నాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్సీఆర్‌లలోనే అత్యధికంగా ఈ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఈ ఐదు ప్రాంతాల జనాభా దేశంలో 29.3 శాతం మాత్రమే అయినప్పటికీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్లలో 79.6 శాతం, లివర్ మార్పిడుల్లో 87.4 శాతం, గుండె మార్పిడుల్లో 87 శాతం, ఊపిరితిత్తుల మార్పిడి సర్జరీలలో ఏకంగా 96.1 శాతం ఇక్కడే నమోదవుతున్నాయి. తెలంగాణ, కేరళ, తమిళనాడులో పది లక్షల జనాభాకు అత్యధికంగా ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు జరుగుతుంటే.. ఉత్తరప్రదేశ్‌లో 1.9 పీఎంపీ(పర్ మిలియన్ పీపుల్), బీహార్‌లో 0.2 పీఎంపీ మేరకు జరుగుతున్నాయి.
కెడావర్ ఆర్గాన్ డొనేషన్‌లో వెనుకబాటు
ఇతర దేశాలలో బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి ఎక్కువగా ఆర్గాన్స్ సేకరిస్తుంటే.. మన దేశంలో మాత్రం 80 శాతానికి పైగా అవయవాలు బతికి ఉన్న బంధువుల (లైవ్ డోనర్స్) నుంచే వస్తున్నాయి. దేశంలో కెడావర్ ఆర్గాన్ డొనేషన్ల రేటు పది లక్షల జనాభాకు కేవలం 0.65గా మాత్రమే ఉంది. ఇది స్పెయిన్ (46 పీఎంపీ) కంటే 70 రెట్లు, అమెరికా (38 పీఎంపీ) కంటే 58 రెట్లు తక్కువ. ఐసీయూల్లో బ్రెయిన్ డెడ్ రోగులను గుర్తించడం, ఆర్గాన్ రిట్రీవల్ ప్రాసెస్, దానాలపై ప్రజల్లో అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని ఈ అధ్యయనం తేల్చింది. అవయవాలను పొందే విషయంలోనూ మహిళలు వివక్షకు గురవుతున్నారు. పేషెంట్ల నిష్పత్తి ఆధారంగా 40 నుంచి 49 శాతం వరకు మహిళలకే అవయవాలు దక్కాల్సి ఉండగా, అది జరగడం లేదు. నాటో 2023 డేటా ప్రకారం.. దేశంలో జరుగుతున్న కిడ్నీ మార్పిడుల్లో మహిళలు కేవలం 36.8 శాతం, లివర్‌లో 30.4 శాతం, గుండె మార్పిడుల్లో అత్యల్పంగా 23.5 శాతం మంది మాత్రమే అవయవాలు పొందగలుగుతున్నారు. మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటి కారణాల వల్ల వారికి అవయవ మార్పిడి చికిత్సలు అందడం లేదని రీసెర్చర్లు తేల్చారు.
ప్రభుత్వాలు తక్షణమే మేల్కోవాలి..
కేవలం ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌పైనే ఆధారపడటం వల్ల అవయవ మార్పిడి సేవలు సామాన్యులకు అందడంలేదని నివేదిక అభిప్రాయపడింది. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఐసీయూలను బలోపేతం చేయడం, బ్రెయిన్ డెడ్ ప్రకటనలను వేగవంతం చేయడం, ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్లను నియమించడం తక్షణ అవసరమని పేర్కొంది. ఆరోగ్య విధానాలను పెంచకపోతే రాబోయే రోజుల్లో దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని రీసెర్చర్లు హెచ్చరించారు.
2040 నాటికి ఆర్గాన్స్‌కు పెరగనున్న డిమాండ్..
దేశంలో జనాభా, ఆయుర్దాయం పెరగడం, మధుమేహం, గుండె జబ్బులు, బీపీ వంటి నాన్- కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువ అవుతుండటంతో 2040 నాటికి అవయవాల డిమాండ్ పెరుగుతుందని రీసెర్చ్ స్పష్టం చేసింది. 2040 నాటికి ఏటా 1.43 లక్షల కిడ్నీలు, 2.10 లక్షల లివర్లు ,95 వేల హార్ట్స్, 12 వేల లంగ్స్ ఉంటేనే రోగుల ప్రాణాలు నిలిచే పరిస్థితులు ఏర్పడతాయని అంచనా వేసింది. ప్రభుత్వాలు సంస్కరణలు చేపట్టి, ఏటా 8 నుంచి 10 శాతం మేర వైద్య సౌకర్యాలు పెంచినా.. 2040 నాటికి కిడ్నీల అవసరాల్లో 32.6 శాతం మాత్రమే తీర్చగలమని.. లివర్, గుండె, లంగ్స్ అవసరాల్లో కనీసం 7 శాతం కూడా తీర్చలేమని నివేదిక హెచ్చరించింది. ఒకవేళ స్పెయిన్ వంటి దేశాల స్థాయిలో 15 శాతం వార్షిక వృద్ధితో విప్లవాత్మక మార్పులు తెచ్చినా.. కిడ్నీలు తప్ప మిగిలిన అవయవాల కొరత తీర్చడం అసాధ్యమని స్పష్టం చేసింది.
ప్రజల్లో అవగాహన పెరగాలి..
రాష్ట్రంలో ప్రస్తుతం కిడ్నీల కోసం 5 వేల మంది, లివర్ కోసం సుమారు 4 వేల మంది వేచి చూస్తున్నారు. తక్కువ మంది ఆర్గాన్ డొనేషన్ చేస్తుండటంతో చాలా మంది అవయవాలు అందక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉన్నది. ఆర్గాన్ డొనేషన్‌పై ప్రజల్లో అవగాహన పెరగాలి. అప్పుడే అవయవాల కొరత తీరుతుంది. ఏటా బ్రెయిన్ డెడ్ కేసుల సంఖ్య సంఖ్య పెరుగుతున్నప్పటికీ డొనేషన్లు మాత్రం ఆ స్థాయిలో ఉండటం లేదు. యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్లలో ఆర్గాన్ డొనేషన్ ప్లెడ్జ్ చేయించాలి. పొలిటికల్ లీడర్లు, ఉద్యోగ సంఘాలు, స్టూడెంట్స్ యూనియన్లు కూడా విధిగా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది.
- డాక్టర్ శ్రీ భూషణ్ రాజ్,
నోడల్ ఆఫీసర్, జీవన్ దాన్
