ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆస్తి హక్కుకు సంబంధించి కీలక తీర్పును వెలువరించింది. ఒక హిందూ వివాహిత మహిళ సంతానం లేకుండా చనిపోతే ఆమె తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన వారసత్వ ఆస్తిపై ఆమె భర్తకు ఎటువంటి హక్కు ఉండదని హైకోర్టు తీర్పు ప్రకటించింది. ఆమె తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా పొందిన ఆస్తి, ఆమె వీలునామా లేకుండా మరణిస్తే ఆ ఆస్తిపై ఆమె భర్తకు ఎటువంటి హక్కు ఉండదని ఏపీ హైకోర్టు తీర్పులో స్పష్టం చేసింది.
ఆ ఆస్తి ఆమె కన్న తండ్రికి పుట్టిన వారసులకే (ఆమె తోడబుట్టిన వాళ్లు) చెందుతుందని తెలిపింది. వారసులకు తల్లిదండ్రుల ఆస్తి సంక్రమణను నియంత్రించే హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 15(2)(ఎ)ను ప్రస్తావిస్తూ, జస్టిస్ తర్లదా రాజశేఖర్ రావు ఈ తీర్పును వెలువరించారు. అనకాపల్లి జిల్లా పాయకరావు పేటకు చెందిన ఒక మహిళ ఆస్తిపై నెలకొన్న వివాదంపై కోర్టు ఈ తీర్పు వెలువరించింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోట గ్రామంలో చిక్కాల వెంకాయమ్మ అనే మహిళకు ఎకరంనర ల్యాండ్ ఉంది. ఆమె కొడుకుకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
వెంకాయమ్మ ఇద్దరి మనవరాళ్లలో ఒకరికి 2002లో పెళ్లైంది. ఆమె పెళ్లి సమయంలో చిక్కాల వెంకాయమ్మకు చెందిన ఎకరంనర భూమిని గిఫ్ట్ డీడ్గా ఇచ్చారు. దీంతో.. వెంకాయమ్మ మనమరాలి పేరు రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కింది. పాస్ బుక్ కూడా వచ్చింది. అయితే.. దురదృష్టవశాత్తూ 2005లో ఈ భూమి పొందిన చిక్కాల వెంకాయమ్మ మనమరాలు చనిపోయింది. ఆమె చనిపోవడంతో.. వెంకాయమ్మ 2007లో ఈ గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసి.. 2011లో రెండో మనవరాలికి ఆ భూమిని గిఫ్ట్‌గా రాసిచ్చింది. రెవెన్యూ రికార్డుల్లో రెండో మనమరాలి పేరును చేర్చాలని 2017లో నర్సీపట్నం ఆర్డీవో ఉత్తర్వులిచ్చారు. వెంకాయమ్మ 2012లో చనిపోయింది.
అయితే.. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ మొదటి మనమరాలి భర్త అనకాపల్లి జాయింట్ కలెక్టర్ దగ్గర రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. 2023లో జాయింట్ కలెక్టర్ ఈ విషయంలో స్పందిస్తూ.. ఆర్డీవో ఉత్తర్వులను తప్పుపట్టారు. గిఫ్ట్ డీడ్ ఒకసారి ఇచ్చేశాక రద్దు చేసే అవకాశం లేదని.. అలా రద్దు చేయాలనుకుంటే సివిల్ కోర్టులో తేల్చుకోవాలని జేసీ సూచించారు.
అయితే.. జేసీ ఇచ్చిన ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వెంకాయమ్మ రెండో మనమరాలు, ఆమె తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన ఏపీ ధర్మాసనం.. జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులను తప్పుబట్టింది. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 15(2)(ఏ)కి వ్యతిరేకంగా జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులిచ్చారని ధర్మాసనం అభిప్రాయపడింది. జేసీ ఉత్తర్వులను రద్దు చేసి వెంకాయమ్మ రెండో మనమరాలు దేవిక మానస పేరును రికార్డుల్లో చేర్చాలని హైకోర్టు సంబంధిత అధికారులను ఆదేశించింది.
