హుజూరాబాద్ ఎలక్షన్​ వెరీ కాస్ట్లీ

హుజూరాబాద్ ఎలక్షన్​ వెరీ కాస్ట్లీ
  • లిపాపల పెట్టి పైసలిస్తున్నరు 
  • చక్కర్లు కొడ్తున్న వీడియోలు 
  • ఏజెంట్లతో హోం డెలివరీ చేయించిన టీఆర్​ఎస్
  • పంపకాల్లో పోటీ పడుతున్న బీజేపీ 
  • ముగిసిన ప్రచారం.. ఎల్లుండే పోలింగ్​

హుజూరాబాద్​ ఉప ఎన్నిక ప్రచార పర్వానికి తెరపడటంతో ఇప్పుడు పైసలు పంచుడు షురూ అయ్యింది. ఓటుకు ఇంత అని లీడర్లు లెక్క పెట్టి ముట్టజెప్తున్నరు. పంచుట్ల ప్రధాన పార్టీలు ముందున్నయ్​. ఒక్కో ఓటుకు రూ. 6 వేల నుంచి 10 వేల దాకా పంచుతున్నట్లు సోషల్​ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నయ్​. టీఆర్​ఎస్​ పేరిట తమకు పైసల లిపాపలు వచ్చినయని జనం బహిరంగంగానే వీడియోల్లో చెప్తున్నరు.  కుటుంబంలో ఒక్క ఓటు ఉంటే.. 1 నంబర్​ అని, నాలుగు ఓట్లు ఉంటే.. 4 నంబర్​ అని కవర్ల మీద కోడ్​ భాష రాసి, అందులో ఓటుకు రూ. 6 వేల చొప్పున ఇస్తున్నరు. కొన్ని చోట్ల ఓటుకు 10 వేల చొప్పున కూడా ఇస్తున్నరు.  పైసల పంపిణీలో బీజేపీ కూడా తగ్గడం లేదని, టీఆర్​ఎస్​తో పోటీ పడి పంచుతున్నట్టు టాక్​ నడుస్తున్నది. 

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా హుజూరాబాద్​ బై ఎలక్షన్​ రికార్డులు బద్దలు కొడుతున్నది. ఇక్కడ పార్టీల మనీ పవర్​ కట్టలు తెంచుకుంటున్నది. హోరాహోరీగా ప్రచారంలో తలపడ్డ పార్టీలు.. మనీ డిస్ట్రిబ్యూషన్​లోనూ పోటీ పడుతున్నాయి. సాధారణంగా ప్రచారం ముగిసిన తర్వాత రోజు మొదలయ్యే ప్రలోభాల పర్వం హుజూరాబాద్​లో అడ్వాన్సుగానే మొదలైంది. ప్రచారం చివరి రోజైన బుధవారం  డబ్బుల పంపిణీ తారస్థాయికి చేరింది. పోలింగ్​కు రెండు రోజులే ఉండటంతో ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని టీఆర్​ఎస్​, బీజేపీ చివరి అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. ఆర్నెల్ల ముందు నుంచే విందులు, వినోదాలతో పోటీ పడుతున్న టీఆర్​ఎస్.. నోట్ల పంపిణీపై ఫోకస్​ పెట్టింది. చివరి అవకాశాన్ని వదులుకోవద్దని బీజేపీ అదే పనిలో పడింది. పోటాపోటీ ఉన్న గ్రామాల్లో ఎంత డబ్బయినా సరే.. పంచి పెట్టేందుకు రెండు పార్టీల లీడర్లు రంగంలోకి దిగారు. ఇంటింటికీ నగదు ముట్టజెప్పి ఓట్లను కొనేందుకు పార్టీలు తలపడుతుండంతో ఇక్కడ ఓటు రేటు అమాంతం పెరిగి పోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మనీ పంపిణీ జరుగుతున్న తీరుతో ఓటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 
ఇంటింటికీ మనీ కవర్లు 
ఒక ప్రధాన పార్టీ తెల్లారుజామునే పాల ప్యాకెట్లు పంచినట్లు అన్ని ఊర్లలో ఏజెంట్లను రంగంలోకి దింపింది. ఏకంగా కవర్లలో మనీ ప్యాక్​ చేసి హోం​ డెలివరీ చేయించింది. ఈ ఫొటోలు, వీడియోలన్నీ బుధవారం ఉదయం నుంచే సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యాయి. లోకల్​ లీడర్లతో కాకుండా  నాన్​ లోకల్​ లీడర్లతో టీఆర్​ఎస్​ ఈ కవర్లను పంపిణీ చేయించిందని బహిరంగంగా చర్చ జరిగింది. ఇద్దరిద్దరు యువకులు బైక్​లపై తిరుగుతున్నారని, వాళ్లే కవర్లు తమకు ఇచ్చినట్లు కమలాపూర్​లో పలు చోట్ల ఓటర్లు వెల్లడించారు. పంపిణీ చేసిన కవర్లలో 500 రూపాయల నోట్లు ఉన్నాయి. ఇంట్లో ఉన్న ఓట్ల సంఖ్యను బట్టి  ఒక్కో ఓటుకు రూ. 6 వేల చొప్పున నగదును వీటిలో ప్యాక్​ చేశారు. పంపిణీ చేసేటప్పుడు ఈజీగా ఉండేలా కవర్లపై ఒకటి, రెండు, మూడు, నాలుగు నెంబర్లు కనిపించాయి. ఓట్ల సంఖ్యను బట్టి కవర్లలో నోట్లు ఉన్నాయని జనం చెప్పుకుంటున్నారు. 
అత్యంత ఖరీదైన ఓటు
2018 అసెంబ్లీ ఎన్నికల టైంలో రాష్ట్రంలో నువ్వా నేనా అన్నట్లు పోటీగా ఉన్న టఫ్​ నియోజకవర్గాలన్నింటా ఓటుకు రూ. 2 వేల చొప్పున పంపిణీ జరిగింది. ఒక్కో అభ్యర్థి దాదాపు రూ. 50 కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు చెప్పుకున్నారు. అప్పటితో పోలిస్తే హుజూరాబాద్​లో ఓటు రేటు ట్రిపుల్​ అయింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 2.60 లక్షల మంది ఓటర్లున్నారు. అందులో రూరల్​ ఏరియాలో దాదాపు లక్ష మంది ఓటర్లకు రూ. 6 వేల చొప్పున.. అంటే రూ. 60 కోట్లకుపైగా ఒకే రోజు డిస్ట్రిబ్యూట్​ చేసినట్లుగా చర్చ జరుగుతున్నది. అత్యధికంగా వీణవంక మండలంలో ఓటుకు రూ. 10 వేల చొప్పున ఇచ్చినట్లు ప్రచారమైంది. సొంత ప్రాంతం కావటంతో ఒక యువ నాయకుడు పోటీపడి మనీ పంచినట్లు సమాచారం.
పోటీ పడి పంచుడు
టీఆర్‌ఎస్‌  డబ్బులు పంచుతుండంతో బీజేపీ కూడా  పంచేందుకు పోటీ పడుతున్నది. హుజూరాబాద్​, జమ్మికుంట పట్టణాలతోపాటు అన్ని రూరల్​ మండలాల్లో రెండు పార్టీలు పోటీ పడ్డట్లుగానే మనీ డిస్ట్రిబ్యూట్​ చేశాయి. దీంతో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది.