ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. వివిధ దేశాల నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటున్న ప్రయాణికులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎబోలా లక్షణాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని గుర్తించేందుకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు వైద్య సిబ్బంది.
ఎబోలా నివారణ చర్యల్లో భాగంగా ఇంటర్నేషనల్ అరైవల్స్ దగ్గర థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు అధికారులు. ఎయిర్పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ థర్మల్ స్క్రీనింగ్ సిస్టం ఏర్పాటు చేసింది.
ఇదిలా ఉండగా.. ఎబోలా వైరస్ ఆఫ్రికా దేశాల్లో బీభత్సం సృష్టిస్తున్న క్రమంలో ఎమర్జెన్సీ ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇప్పుడు నెమ్మదిగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. మన దేశంలో విమానాశ్రయాల్లో ప్రత్యేకంగా ఎబోలా డిటెక్టింగ్ ఏర్పాట్లు చేశారు. నమోదు కేసుల్లో దాదాపు 50 శాతం మరణాలు సంభవిస్తుండటంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తి ఆందోళన రేకెత్తిస్తోంది.
