ప్రవల్లికది ముమ్మాటికీ కేసీఆర్ సర్కారు హత్యే​: కిషన్​రెడ్డి

ప్రవల్లికది ముమ్మాటికీ కేసీఆర్ సర్కారు హత్యే​: కిషన్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో ప్రవల్లిక అనే నిరుద్యోగ యువతి ఆత్మహత్య అత్యంత దురదృష్టకరమని, ఇది కేసీఆర్ ప్రభుత్వం కుట్రపూరితంగా చేసిన హత్యేనని బీజేపీ స్టేట్ చీఫ్​, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం, కల్వకుంట్ల కుటుంబమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. శనివారం బీజేపీ స్టేట్ఆఫీసులో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత దీనావస్థకు రాష్ట్ర ప్రభుత్వ కుట్రపూరిత విధానాలే కారణమని మండిపడ్డారు.

‘‘తన ఇంటికి ఆరు ఉద్యోగాలు ఇచ్చుకున్న సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో నిరుద్యోగ యువతను మాత్రం రోడ్డున పడేసిండు. మరో 60 రోజులు ఆగండి.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువత ఆకాంక్షలకు తగ్గట్టుగా, పారదర్శకంగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపడ్తం.  యువత ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దు. తల్లిదండ్రులను, కుటుంసభ్యులకు కడుపుకోతను మిగిల్చొద్దు” అని ఆయన కోరారు.

తెలంగాణ ఉద్యమ నినాదంలోని ‘నియామకాల’ విషయంలో యువత దగాపడిందని అన్నారు. కేసీఆర్​ సర్కారు వచ్చాక ఏ ఉద్యోగ నియామక ప్రక్రియను సాఫీగా, పారదర్శకంగా, షెడ్యూల్ ప్రకారం నిర్వహించలేదని, దీని కారణంగానే యువతలో ఆందోళన నెలకొందని తెలిపారు. ‘‘ఇప్పుడు పోటీ పరీక్షలు, డీఎస్సీకి ఎన్నికల కోడ్ ను కారణంగా చూపిస్తున్న కల్వకుంట్ల ప్రభుత్వం.. కోడ్ రాకముందు ఏం చేసింది? నవంబర్​లోనే  ఎన్నికలు వస్తాయనే విషయం తెలిసినప్పుడు ముందుగా ఎందుకు పోటీ పరీక్షలు నిర్వహించలేదు?” అని ఆయన నిలదీశారు.  

పోలీసుల దగ్గరున్న ఆధారాలేంటి?

‘‘ఏ ప్రాతిపదికన ప్రవల్లిక మరణంపై ఆరోపణలు చేస్తున్నారో పోలీసులు చెప్పాలి. వారి దగ్గర ఉన్న ఆధారాలను బయట పెట్టాలి. పరీక్షలు వాయిదా పడడంతో మనస్థాపానికి గురైందని ఆ అమ్మాయి కుటుంబ సభ్యులే చెప్పారు. ప్రవల్లికకు సంఘీభావంగా లక్షలాది యువత కదిలి వచ్చారు. ప్రభుత్వంపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో యువత నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే అర్థమవుతున్నది” అని కిషన్​రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ వ్యవహారాన్ని గోల్ మాల్ వ్యవహారంగా మార్చేశారని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

‘‘లక్షలాది మంది యువత జీవితాలతో ఆడుకుంటున్న టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయకుండా ఎందుకు కాపాడుతున్నరు?  సీఎం సీటులో కూర్చునే నైతిక హక్కును కేసీఆర్​ కోల్పోయిండు” అని అన్నారు. ప్రవల్లిక ఆత్మహత్యతో తీవ్ర ఆందోళనకు గురై ఆమె కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన ఎంపీ లక్ష్మణ్, బీజేవైఎం నాయకులు, నిరుద్యోగ యువతపై పోలీసులు దాడి చేయడం ఏమిటని నిలదీశారు. ఇదేం దౌర్జన్యం అని ప్రశ్నించారు.  ప్రవల్లిక బంధువులతో కిషన్ రెడ్డి మాట్లాడి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

కాంగ్రెస్​కు కర్నాటక నుంచి డబ్బుల కట్టలు

దోపిడీ, అవినీతి, అహంకారం కాంగ్రెస్ డీఎన్ఏ లోనే ఉన్నాయని కిషన్​రెడ్డి దుయ్యబట్టారు. ‘‘ప్రజా సంపదను లూటీ చేయడం కాంగ్రెస్​కు వెన్నతో పెట్టిన విద్య. ఎన్నికల్లో కాంగ్రెస్​కు డబ్బుల కట్టలు కర్నాటక నుంచి వస్తున్నయ్​. బెంగళూరులో ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో రూ.42 కోట్లు బయటపడ్డయ్​. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాగే లూటీలు కొనసాగుతున్నయ్.

రాహుల్ గాంధీ చేసింది జోడో యాత్ర కాదు.. ఇండియా లూటో యాత్ర” అని మండిపడ్డారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటికీ బీఆర్ఎస్ దొంగ పత్రాలు సృష్టించి అభివృద్ధి పనుల పేరుతో వివిధ సామాజిక వర్గాలను మభ్యపెడుతున్నదని అన్నారు. 9 ఏండ్లలో కమీషన్ రూపంలో వచ్చిన డబ్బులను ఈ ఎన్నికల్లో ఖర్చుపెట్టేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. ‘‘బీఆర్ఎస్, కాంగ్రెస్  డీఎన్ఏ ఒక్కటే. బీఆర్ఎస్​ను శాశ్వతంగా ఫామ్ హౌస్ కు పంపాలి. జలయజ్ఞం, భూయజ్ఞం పేరుతో కాంగ్రెస్  దోపిడీ చేసింది.

బోఫోర్స్, బొగ్గు, కామన్ వెల్త్, టెలికాం వంటి భారీ అవినీతి కుంభకోణాలు చేసి కాంగ్రెస్ దేశ సొమ్మును లూటీ చేసింది” అని మండిపడ్డారు. పొన్నాల పెనంలోంచి పొయ్యిలో పడుతున్నారని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని తెలిపారు.