గండిపేట, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌లో మరో భారీ చిట్టీ మోసం వెలుగులోకి వచ్చింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్‌లో చిట్టీల పేరుతో రూ.3 కోట్ల వరకు డబ్బులు వసూలు చేసి దంపతులు పరారైన ఘటన కలకలం రేపుతోంది. అశోక్ అనే వ్యక్తి గత కొంతకాలంగా చిట్టీలు నిర్వహిస్తూ మహిళలు, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాల నుంచి భారీ మొత్తంలో నగదు సేకరించాడు.
అనంతరం తన భార్యతో కలిసి ఇంటికి తాళం వేసి పరారైనట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన బాధితులు అశోక్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. తాము కూడబెట్టుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న దంపతుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
