హైదరాబాద్లోని కాలనీ పార్కులపై స్పెషల్ ఫోకస్.. 200 పార్కులను డెవలప్చేసేందుకు నిర్ణయం

హైదరాబాద్లోని కాలనీ పార్కులపై  స్పెషల్ ఫోకస్.. 200 పార్కులను డెవలప్చేసేందుకు నిర్ణయం
  • వన మహోత్సవంలో భాగంగా ఈసారి హెచ్‌‌‌‌ఎండీఏ పరిధిలో పచ్చదనం పెంచేందుకు ప్లాన్​
  •  దాదాపు రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అధికారుల వెల్లడి

హైదరాబాద్ సిటీ, వెలుగు:  హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌‌‌‌మెంట్ అథారిటీ(హెచ్‌‌‌‌ఎండీఏ) పరిధిలో పచ్చదనం పెంచేందుకు అధికారులు సరికొత్త ప్రణాళిక రూపొందించారు. వన మహోత్సవంలో భాగంగా ఈ ఏడాది కాలనీ పార్కులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. మొత్తం 11,258 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన హెచ్‌‌‌‌ఎండీఏ పరిధిలో పచ్చదనం పెంపునకు ఈ సంవత్సరం దాదాపు రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే సీఎంసీ, జీహెచ్‌‌‌‌ఎంసీ, ఎంఎంసీ పరిధిలోని ప్రాంతాలను కలుపుకొని కాలనీ పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు అర్బన్ ఫారెస్ట్రీ అధికారి ఒకరు వెల్లడించారు.

450కి పైగా పార్కులు

ప్రస్తుతం హెచ్‌‌‌‌ఎండీఏ పరిధిలో చిన్నవి, పెద్దవి కలిపి 450కి పైగా పార్కులు ఉన్నాయి. సాధారణంగా ఫారెస్ట్ బ్లాక్‌‌‌‌లు, పెద్ద పార్కులనే ఎక్కువగా అభివృద్ధి చేస్తుంటారు. అయితే, ఈసారి కోర్ ఏరియా పరిధిలోని జీహెచ్‌‌‌‌ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ పరిధుల్లోని కాలనీలను ఎంపిక చేసి, అక్కడ కూడా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

కాలనీ పార్కులపై ప్రత్యేక దృష్టి

ఈసారి హెచ్‌‌‌‌ఎండీఏ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న కాలనీలపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారు. వన మహోత్సవంలో భాగంగా ఒక ఎకరం లోపు స్థలంలో ఉన్న 200 పార్కులను డెవలప్​చేయనున్నారు. ఇందుకోసం కాలనీ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి అధికారులను సంప్రదిస్తే.. వారు ఆయా ప్రాంతాలను పరిశీలించి పనులు చేపడతారు.

మొదటి దశలో 100 పార్కులు

మొత్తం 200 కాలనీ పార్కుల లక్ష్యంలో భాగంగా, మొదటి దశలో జీహెచ్‌‌‌‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పరిధిలో 100 పార్కులను అభివృద్ధి చేయనున్నారు. కేవలం పార్కులే కాకుండా, కాలనీల్లో పచ్చదనాన్ని పెంచేందుకు స్థానిక అసోసియేషన్లు ముందుకు వస్తే ఉచితంగా మొక్కలను పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. ఇందుకోసం హెచ్‌‌‌‌ఎండీఏ నర్సరీలలో మొక్కలను సిద్ధంగా ఉంచారు.