హైదరాబాద్, వెలుగు: ట్రైనీ మహిళా ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసులో అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ఈ మేరకు ఏడు రోజుల కస్టడీ కోరుతూ ఇప్పటికే ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం వాదనలు ముగియనున్నాయి. అనంతరం కోర్టు తన తీర్పు వెల్లడించనుంది. కేసు తీవ్రత నేపథ్యంలో కనీసం నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి లభించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
రాజేంద్రనగర్ శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీ(ఎన్‌పీఏ)లో ట్రైనీ మహిళా ఐపీఎస్‌అధికారినిపై ఉదయ్ కృష్ణారెడ్డిని లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. బాధిత ట్రైనీ ఐపీఎస్‌ఫిర్యాదు మేరకు ఈ నెల 18న అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. జులై 28న మిర్యాలగూడలో పోలీసుల చిక్కాడు. ఈ క్రమంలో పూర్తి విచారణ జరిపేందుకు పోలీసులకు అవకాశం లభించలేదు. దీంతో కస్టడీకి తీసుకుని ప్రశ్నించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
