బషీర్‌బాగ్, వెలుగు: డిజిటల్ అరెస్ట్ పేరిట అమాయకులను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఢిల్లీకి చెందిన గురుదీప్ సింగ్ అలియాస్ లక్కీ నారంగ్(42)ను అరెస్ట్ చేసినట్లు డీసీపీ వి.అరవింద్ బాబు తెలిపారు. 2025 అక్టోబర్ 16న హైదరాబాద్‌కు చెందిన 62 ఏళ్ల వ్యక్తికి ఫోన్ చేసి ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులమని నటించిన స్కామర్లు, ఆధార్ అక్రమ వినియోగం పేరుతో బెదిరించి వీడియో కాల్ ద్వారా పర్యవేక్షించారు. అరెస్ట్ తప్పించుకోవాలంటే డబ్బులు చెల్లించాలని నమ్మించి విడతల వారీగా రూ.1.07 కోట్లు కాజేశారు.
గురుదీప్ సింగ్ ట్రావెల్, మనీ ఎక్సేంజ్ వ్యాపారం ముసుగులో అక్రమ బ్యాంక్ ఖాతాలు తెరిపించి, వాటి ద్వారా డబ్బును ఇతర నిందితులకు తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇప్పటికే దీపక్ గెహ్లావత్, ప్రశాంత్ కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు డీసీపీ తెలిపారు.
