హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలో మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 1,200 ఎలక్ట్రిక్ స్కూటర్లు పంపిణీ చేయనున్నామని, 28,045 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లో మైనార్టీ శాఖ ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఒక్కో ఈ–-స్కూటర్ ధర రూ.1.50 లక్షలు కాగా, ప్రభుత్వం 80 శాతం సబ్సిడీ కింద రూ.1.20 లక్షలు ఇస్తుందన్నారు. లబ్ధిదారుడు 20 శాతం వాటాగా రూ.30 వేలు చెల్లించాలన్నారు. తుది ఎంపికను ఆగస్టు 20 లోపు ముగించాలని సూచించారు. జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి ఇలియాస్ అహ్మద్, జీహెచ్‌ఎంసీ జాయింట్ కమిషనర్ దేవేందర్ రెడ్డి, ఎంవీఐ మహేశ్‌కుమార్ పాల్గొన్నారు.
