చనిపోయిన వారి ఫామ్ నింపి ఇస్తే క్రిమినల్ కేసు: హైదరాబాద్ ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్

చనిపోయిన వారి ఫామ్ నింపి ఇస్తే క్రిమినల్ కేసు: హైదరాబాద్ ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్
  • ఇప్పటివరకు 10 శాతం మంది ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్ కేటగిరీలోకి 
  • ఓటు హక్కుకు ప్రభుత్వ స్కీమ్​లకు సంబంధం లేదు
  • ఎన్యుమరేషన్ ఫామ్ రాని వారు బీఎల్వోను సంప్రదించాలి.. లేదా 1950కి కాల్ చేయాలని సూచన

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని ఇప్పటికే 53.3 శాతం ఎన్యుమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేసినట్టు ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. మంగళవారం జీహెచ్‌‌ఎంసీ ఆఫీసులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికీ ఎన్యుమరేషన్ ఫారం రాని వారు వెంటనే తమ ప్రాంతంలోని బూత్ స్థాయి అధికారి(బీఎల్‌‌వో)ని సంప్రదించాలని లేదా 1950 నంబర్‌‌కు కాల్ చేయాలని సూచించారు. 

ప్రస్తుతానికి 10 శాతం మందిని ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్ కేటగిరీ కింద వేశామని, రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఆగస్టు 3 వరకు చివరి గడువు ఉన్నందున ఓటర్లు వీలైనంత త్వరగా తమ ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్‌‌ఓలకు అందజేయాలని కోరారు. చనిపోయిన వ్యక్తుల పేరిట ఫారాలు నింపి ఇస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎన్నికల అధికారి కర్ణన్ హెచ్చరించారు. 

ఫారాలు తప్పుగా నింపిన వారికి నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిపారు. ఓటు హక్కుకు ప్రభుత్వ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని, కొందరు రెండు చోట్లా ఓట్లు కలిగి ఉండి హైదరాబాద్‌‌లో కాకుండా తమ స్వస్థలాల్లో ఎన్యుమరేషన్ చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

పార్టీలు అన్ని పోలింగ్ స్టేషన్లకు బీఎల్‌‌ఏలను నియమించాలి

రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్ల (బీఎల్‌‌ఏల) నియామకానికి సంబంధించి మొత్తం 4,062 పోలింగ్ స్టేషన్లు ఉండగా..  కాంగ్రెస్ 3,601 పోలింగ్ స్టేషన్లలో (88.65 శాతం), బీజేపీ 3,044 పోలింగ్ స్టేషన్లలో (74.94 శాతం ), ఏఐఎంఐఎం 2,519 పోలింగ్ స్టేషన్లలో (62.01శాతం) బీఆర్ఎస్ 2,212 పోలింగ్ స్టేషన్లలో (54.46 శాతం) బీఎల్‌‌ఏలను నియమించినట్టు కర్ణన్ తెలిపారు. తక్కువ నియామకాలు ఉన్న పార్టీలు వెంటనే అన్ని పోలింగ్ స్టేషన్లకు బీఎల్‌‌ఏలను నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంలో బీఎల్‌‌ఏలు పూర్తి సహకారం అందించాలన్నారు. 

రోజువారీగా ఆ ఫారాలను సంబంధిత బీఎల్‌‌ఓలకు అందజేయాలని సూచించారు. ఒక బీఎల్‌‌ఏ రోజుకు గరిష్టంగా 30 ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్‌‌ఓకు సమర్పించేందుకు అవకాశం ఉందన్నారు.  ఇప్పటికే ఓటర్లు సర్ ఫామ్ లు నింపేందుకు అనేక అవేర్‌‌‌‌నెస్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆటోరిక్షాల ద్వారా మైక్ ప్రచారాలు, వార్తాపత్రికలు, టెలివిజన్, రేడియో, సోషల్ మీడియా ద్వారా యాడ్స్ ఇస్తున్నట్టు తెలిపారు. బ్యానర్లు, పోస్టర్లు, హోర్డింగ్‌‌లతో పాటు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లతో ఇంటరాక్టివ్ సమావేశాలు జరుపుతున్నట్టు కర్ణన్ తెలిపారు.

ఇంకా 22.10 లక్షల ఫారాలు డిజిటలైజేషన్ కావాలి.. 

ఆగస్టు 3 వరకు పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియ కొనసాగుతుందని.. 1,200 కన్నా ఎక్కువ ఓట్లు ఉన్న పోలింగ్ స్టేషన్లను గుర్తించి, ప్రతి స్టేషన్‌‌లో 1,200 లోపు మాత్రమే ఓట్లు ఉండేలా పునర్వ్యవస్థీకరిస్తామని తెలిపారు. ఆ తర్వాత ఆగస్టు 10వ తేదీన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రకటిస్తామన్నారు. సెప్టెంబర్ 8 వరకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ల స్వీకరణ ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 28 మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న గణాంకాల ప్రకారం.. జిల్లాలో మొత్తం 47,36,669 మంది ఓటర్లు ఉండగా.. అందరికీ 100 శాతం ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్టు తెలిపారు. 

ఇందులో 4,81,744 (10.17 శాతం ) మంది ఓటర్లు ఆన్‌‌లైన్‌‌లో  ఫారాలు సమర్పించగా.. 25,26,014 (53.33 శాతం) ఫారాలు డిజిటలైజ్ అయినట్టు పేర్కొన్నారు. మరో ఆరు రోజుల సమయం ఉండగా..  ఇంకా 22,10,655 ఫారాలు డిజిటలైజేషన్ చేయాల్సి ఉందన్నారు. ఆగస్టు 3వ తేదీ చివరి డేట్ అని.. అందరూ అప్పటి వరకు ఆగొద్దని వీలైనంత తొందరగా ఫామ్ నింపి ఇస్తే డిజిటలైజ్ చేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రజల సౌకర్యార్థం 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్‌‌‌‌వో ఆఫీసుల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌‌లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.