పడిపోయిన హైదరాబాద్ ర్యాంకు.. 2014లో 4వ ర్యాంక్.. ఇప్పుడు 24వ ర్యాంక్

పడిపోయిన హైదరాబాద్ ర్యాంకు.. 2014లో 4వ ర్యాంక్.. ఇప్పుడు 24వ ర్యాంక్
  • హైదరాబాద్ ర్యాంకు డౌన్​
  • నివాసానికి అనుకూలమైన సిటీల జాబితాలో టాప్‌టెన్‌లో దక్కని చోటు
  • ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందని నాణ్యమైన సేవలు
  • వాన నీటిని మళ్లించే డ్రైనేజీ వ్యవస్థ కరువు
  • ఆర్థికాభివృద్ధిలోనూ దేశ సగటు కన్నా తక్కువే
  • హైదరాబాద్​ కన్నా మెరుగైన స్థానంలో విశాఖపట్నం
  • రిపోర్టు విడుదల చేసిన కేంద్రమంత్రి హర్దీప్​ సింగ్​

న్యూఢిల్లీ, వెలుగు: ‘హైదరాబాద్​ను విశ్వనగరంగా మారుస్తం’.. ఇదీ తెలంగాణ వచ్చినప్పటి నుంచి టీఆర్​ఎస్​ ప్రభుత్వం పదేపదే చెబుతున్న మాట. కానీ, పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. 2014లో నివాసానికి అనుకూలంగా ఉన్న సిటీల జాబితాలో నాలుగో స్థానంలో ఉండేది మన హైదరాబాద్​. కానీ, ఆరేండ్లలో పరిస్థితి నానాటికీ పడిపోతూ వచ్చింది. 2020 నాటికి 24వ స్థానానికి దిగజారిపోయింది. గురువారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈజ్​ ఆఫ్​ లివింగ్​ ఇండెక్స్​ 2020 నివేదికలో హైదరాబాద్​కు కనీసం టాప్​టెన్​లోనూ చోటు దక్కని పరిస్థితి. 111 సిటీలపై గత ఏడాది జనవరి 16 నుంచి మార్చి 20 వరకు 32.2 లక్షల మంది జనాల అభిప్రాయాలను తీసుకుని కేంద్రం ఈ సర్వే చేసింది.

2014 నుంచి పడిపోయిన గ్రాఫ్​

జాబితాలో హైదరాబాద్​ కన్నా ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం మెరుగైన స్థానంలో నిలిచింది. 55.4 ఓవరాల్​ స్కోరుతో హైదరాబాద్​కు 24వ ర్యాంకు దక్కితే.. 57.28 స్కోరుతో విశాఖపట్నం 15వ స్థానంలో నిలిచింది. అయితే 2014లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం హైదరాబాద్​ నాలుగో స్థానంలో నిలిచింది. కానీ, ఇప్పుడు 20 స్థానాలు కిందకు జారిపోయింది. దక్షిణాది పరంగా చూసుకున్నా హైదరాబాద్​కు మెరుగైన స్థానం దక్కలేదు. రీజియన్​లో మొత్తం 8 సిటీలను సర్వేలో కవర్​ చేస్తే మన సిటీ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ జాబితాలో బెంగళూరే మొదటి స్థానంలో నిలవగా.. చెన్నై రెండో ర్యాంకు సాధించింది. ఈ జాబితాలో బెంగళూరే మొదటి స్థానంలో నిలవగా.. చెన్నై రెండో ర్యాంకు సాధించింది.

నాలుగు అంశాలుగా సర్వే
క్వాలిటీ లైఫ్, ఆర్థిక స్థితిగతులు, పచ్చదనం, ప్రజాభిప్రాయం అనే నాలుగు అంశాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం సిటీల్లో జీవన స్థితిగతులపై సర్వే
చేసింది. ఆ నాలుగు విభాగాలనూ సబ్ గ్రూపులుగా విభజించింది. క్వాలిటీ లైఫ్‌లో చదువు, ఆరోగ్యం, ఇల్లు, నీళ్లు-డ్రైనేజీ వసతి, రవాణా సదుపాయం, భద్రత వంటి వాటిని లెక్కలోకి తీసుకుంది. ఆర్థిక స్థితిగతుల్లో ఆర్థికాభివృద్ధి స్థాయి, ఆర్థికావకాశాల ఆధారంగా సర్వే చేసింది. పచ్చదనం విభాగంలో పర్యావరణం, పచ్చదనం-భవనాలు, కరెంట్ వాడకం వంటి వాటిని లెక్కలోకి తీసుకుంది. మొత్తం స్కోరులో 70 శాతం ఈ 3విభాగాలకు కేటాయించగా.. 30 శాతం స్కోరును ప్రజాభిప్రాయాలకు ఇచ్చింది.

జనాభా రెండు కేటగిరీలుగా..
10 లక్షల కన్నా ఎక్కువ మంది ఉన్న సిటీలు, 10 లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న సిటీలుగా సర్వేను కేంద్రం విభజించింది. 10 లక్షలపైన జనాభా ఉన్న సిటీల జాబితాలో.. దేశ సిలికాన్ వ్యాలీగా పిలుచుకునే బెంగళూరు మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఆ సిటీకి మొత్తంగా 66.70 స్కోరు వచ్చింది. తర్వాతి స్థానంలో పూణె నిలిచింది. అహ్మదాబాద్, చెన్నై, సూరత్, నవీ ముంబై, కోయంబత్తూరు, వడోదర, ఇండోర్, గ్రేటర్ ముంబైలు టాప్ టెన్‌లో నిలిచాయి. ఇక, పది లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న సిటీల జాబితాలో సిమ్లా ఫస్ట్​ ర్యాంకును సాధించింది. ఈ జాబితాలో ఏపీకి చెందిన కాకినాడ నాలుగో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. అదే సమయంలో తెలంగాణ నుంచి ఒక్క సిటీకీ టాప్ టెన్‌లో చోటు దక్కలేదు. భువనేశ్వర్, సిల్వాసా, సేలం, వెల్లూరు, గాంధీనగర్, గురుగ్రామ్, దావనగెరె, తిరుచురాపల్లిలు టాప్ టెన్‌లో నిలిచాయి. వరంగల్ 19, కరీంనగర్ 22వ స్థానాల్లో నిలిచాయి.

వరద పోయే దారేది?

భారీ వానలు పడినప్పుడు ఆ వరద నీటిని మళ్లించే సరైన డ్రైనేజీ వ్యవస్థ కూడా సిటీలో లేదని నివేదిక పేర్కొంది. హైదరాబాద్ తో పాటు ముంబై, ఢిల్లీ,
బెంగళూరులోనూ ఆ పరిస్థితి ఉందని వెల్లడించింది. మొన్నటి వరదలతో హైదరాబాద్ జనం ఎంత ఇబ్బంది పడ్డారో తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు చాలా మంది వరద నీటిలోనే బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ నీటిని తొలగించే కనీస చర్యలూ కరువయ్యాయి. అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థలతో రోడ్లపైన ఎక్కడికక్కడ నీళ్లు నిలిచాయి.

స్లమ్స్​లో ఎక్కువ మంది..

మురికివాడలు అనగానే అందరికీ ముందు గుర్తొచ్చేది ముంబై మహానగరమే. కానీ, దాంతో పాటు మరికొన్ని సిటీలూ ఆ జాబితాలో ఉన్నాయి. మన హైదరాబాద్​ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. విశాఖపట్నం, ఆగ్రా, భువనేశ్వర్​, లక్నో, పుణె వంటి ప్రధాన సిటీల్లోనూ మురికివాడల్లో బతుకుతున్న వారు ఎక్కువగానే ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్​ యోజన అమలు కాకపోవడం వల్లే ఈ పరిస్థితులున్నాయని నివేదిక పేర్కొంది.

జనమూ మెచ్చలేదా?
సర్వే లో నాలుగో అంశమైన ‘జనం మెచ్చిన సిటీ’ల జాబితాలోనూ హైదరాబాద్ పరిస్థితి అంతంతే ఉంది. ఈ విషయంలో 90 స్థానంలో నిలిచింది. మంచి స్కోరే వచ్చినా హైదరాబాద్ కన్నా ముందు చాలా సిటీలు చోటు సంపాదించాయి. ఓవరాల్‌గా ఈ విభాగంలో హైదరాబాద్‌కు వచ్చిన స్కోరు 70. ఒడిశా రాజధాని భువనేశ్వర్ 94.8 స్కోరుతో మొదటి స్థానంలో నిలిచింది. 85.4 స్కోరుతో కాకినాడ 8వ ర్యాంకు సాధించింది. విశాఖపట్నం కూడా మన కన్నా ముందే ఉంది. 77 స్కోరుతో 45వ ర్యాంకును దక్కించుకుంది. వరంగల్ కూడా హైదరాబాద్ కన్నా మెరుగైన స్థానంలో నిలిచింది. 72.3 స్కోరుతో 82వ ర్యాంకు సాధించింది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అంతంతే..
ఆరోగ్య రంగం విషయంలోనూ హైదరాబాద్‌కు నిరాశే ఎదురైంది. పేరుకు గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ వంటి పెద్ద పెద్ద ఆస్పత్రులున్నా .. ఆయా నెట్ వర్క్​లలో అందుతున్న సేవలు అంతంత మాత్రమేనని కేంద్ర నివేదిక వెల్లడించింది. సర్వేలోని 50 శాతం సిటీల్లో ప్రభుత్వం నుంచి అందుతున్న ఆరోగ్య సేవలు 1 శాతం కన్నా తక్కువేనని చెప్పింది. జాబితాలో హైదరాబాద్‌నూ చేర్చింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన నాణ్యతా ప్రమాణాలను పాటించట్లేదని వెల్లడించింది. ఆయా సిటీల్లో ప్రైవేట్ దవాఖానాల నెట్ వర్క్​ ఎక్కువగా ఉందని పేర్కొంది. కొన్ని ఆస్పత్రులు ప్రభుత్వ రూల్స్‌నూ పట్టించుకోవట్లేదని తెలిపింది.

పచ్చదనం తగ్గుతున్నది…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమం హరితహారం. రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నా.. వాటిని
కాపాడే బాధ్యతను మాత్రం పెద్దగా పట్టించుకోవట్లేదు. ఈ విషయాన్ని నివేదిక ప్రస్తావించింది. సిటీలో పచ్చదనం విపరీతంగా తగ్గిపోతోందని వెల్లడించింది. మన సిటీతో పాటు మరికొన్ని సిటీలూ పచ్చదనం, పర్యావరణం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నాయని రిపోర్ట్​ వెల్లడించింది.

ఎకానమీలోనూ వీక్ …
ఆర్థికాభివృద్ధిలోనూ హైదరాబాద్ వెనుకబడుతోందని కేంద్ర నివేదిక పేర్కొంది. మన దగ్గర ఆర్థికాభివృద్ధి దేశ సగటు కన్నా తక్కు వగానే
నమోదవుతోందని పేర్కొంది. హైదరాబాద్‌తో పాటు మరో 72 సిటీలు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే, ఆర్థికావకాశాలను సృష్టించుకోవడంలో మాత్రం మన సిటీ మంచి స్థానంలోనే ఉందని నివేదిక పేర్కొంది. ఈ కేటగిరీలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా, బెంగళూరు, హైదరాబాద్‌లు ఆ
తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.