V6 News

మాడు పగిలే ఎండ..!..మంగళవారం హయత్ నగర్ లో 41 డిగ్రీల టెంపరేచర్

మాడు పగిలే ఎండ..!..మంగళవారం హయత్ నగర్ లో 41 డిగ్రీల టెంపరేచర్
  •     సంతోష్ నగర్, బేగంపేట్​లో 40.9  
  •     వచ్చే 5 రోజులు జాగ్రత్తగా ఉండాలన్న వాతావరణ శాఖ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్​లో రెండు రోజుల నుంచి చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం హయత్ నగర్ లో 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, సంతోష్ నగర్, బేగంపేట్ ప్రాంతాల్లో 40.9 డిగ్రీలు, షేక్ పేట్, ఆర్సీ పురం, సికింద్రాబాద్, ఆసిఫ్ నగర్ లాంటి ప్రాంతాల్లో 40.8 డిగ్రీల వరకు రికార్డయ్యింది. సరూర్ నగర్ 40.7, ముషీరాబాద్, శేరిలింగంపల్లి 40.6, ఉప్పల్, కూకట్ పల్లి 40.5, డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 

వేడిగాలులూ ఎక్కువే 

సిటీ శివారులోని సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ ఏరియాల్లో వేడి గాలుల ప్రభావం ఎక్కువగా ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఎండల తీవ్రతకు జనం బయటకు రావడం లేదు. దీంతో ఎప్పుడూ రద్దీగా కనిపించే సిటీ రోడ్లు మధ్యాహ్నం బోసిపోయి కనిపిస్తున్నాయి. వచ్చే అయిదు రోజులు ఇదే విధంగా ఎండలు దంచికొడతాయని , హీట్ వేవ్స్ ప్రభావం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  వీలైనంత వరకు ప్రజలు  మధ్యాహ్నం ఎండలో తిరగొద్దని, ఇండ్లలోనే ఉండాలని కోరింది. తగినంత నీరు తీసుకోవాలని, క్యాప్ పెట్టుకోవాలని సూచించింది.