- మెట్రో రైల్వేకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు చేపట్టిన మెట్రో ఫేజ్ 2 పనులకు సంబంధించి ప్రస్తుత పరిస్థితిపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలంటూ మెట్రో రైల్వేకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు హైకోర్టు మొదటి కోర్టు హాలులో అలైన్‌మెంట్‌కు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను వీక్షించింది.
అనంతరం మెట్రో రెండో దశ నిర్మాణ అనుమతి కోసం పెట్టుకున్న దరఖాస్తులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో చెప్పాలంటూ ఉత్తర్వులిచ్చింది. మెట్రో రెండో దశలోని 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారసత్వ కట్టడాలు, వాటిపై మెట్రో రైలు మార్గం చూపే ప్రభావంపై అధ్యయనం చేసి నివేదికలో స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది.
దీంతోపాటు వారసత్వ కట్టడాల పరిరక్షణ కమిటీ ఏర్పాటైందా, ఒకవేళ ఉంటే అది పనిచేస్తుందో లేదో కూడా వెల్లడించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 3కు వాయిదా వేసింది. వారసత్వ కట్టడాలకు ప్రతికూలంగా ఉన్న ఎంజీబీఎస్ నుంచి శంషాబాద్ వరకు చేపట్టిన నాలుగో కారిడార్ నిర్మాణంలో భాగంగా మెట్రో రెండో దశ విస్తరణ పనులను నిలిపివేస్తూ ఉత్తర్వులివ్వాలంటూ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు అయ్యాయి.
