కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఇటీవల హైదరాబాద్‌లో అదృశ్యమైన యువకుడి మృతదేహం సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు జిల్లా సింగరాయకొండ సమీపంలోని ఓ బావిలో లభ్యమైంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. అయిలాపూర్‌కు చెందిన అంకం రాజేశ్, వనిత దంపతుల కొడుకు రాహుల్(22) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. కాచిగూడలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న అతడు మే 27న స్నేహితులకు చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. రాహుల్ కనిపించకపోవడంతో మే 29న స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే హైదరాబాద్‌కు చేరుకున్న తల్లిదండ్రులు కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా మే 27న రాహుల్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. అదృశ్యమైనప్పటి నుంచి అతని సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం సింగరాయకొండ సమీపంలోని ఓ బావిలో రాహుల్ మృతదేహం లభ్యమైంది. మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాహుల్ మృతితో అయిలాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది.
