
- నకిలీ పత్రాలతో రూ.27 కోట్ల రుణం
- మోసం చేసిన సంస్థ నిర్వాహకులకు సహకరించిన ఏజీఎం సంజయ్
హైదరాబాద్, వెలుగు: బాలానగర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో జరిగిన రూ.27 కోట్లు లోన్ ఫ్రాడ్ కేసులో నిందితులకు సహకరించిన ఎస్‌బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కొడూరు సంజయ్(53)ను సీఐడీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచి చంచల్‌గూడ జైలులో రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు సీఐడీ చీఫ్ శిఖాగోయల్ పత్రికా ప్రకటనలో వివరాలు వెల్లడించారు. కొడూరు సంజయ్ ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఎస్‌బీఐ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్‌లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ విధులు నిర్వహిస్తున్నాడు.
2009–-2011 మధ్య కాలంలో బాలానగర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో స్మాల్ మీడియం ఎంటర్ ప్రైజెస్ రిలేషన్‌న్షిప్ మేనేజర్‌గా పనిచేశాడు. అదే సమయంలో ఆదర్శ్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు క్యాష్ క్రెడిట్ లోన్ కింద రూ.27 కోట్లు రుణం మంజూరు చేశాడు. రుణం కోసం సదరు సంస్థ నిర్వాహకులు తప్పుడు పత్రాలు సమర్పిస్తున్నారన్న విషయం తెలిసి కూడా వారితో కలిసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు.
ఆ తరువాత సంస్థ ఎండీ ఆంజనేయులు, ఆయన భార్య మణికొండ రీటా తిరిగి చెల్లించకుండా 2018 నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతేడాది వీరిద్దరినీ రాష్ట్ర సీఐడీ అధికారులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఏజీఎం సంజయ్‌తో పాటు కస్టమర్ సపోర్ట్ ఆఫీసర్ రవీంధ్రనాథ్ ప్రమేయం గుర్తించారు. ఈ మేరకు ఏజీఎం సంజయ్‌ని అరెస్ట్ చేసినట్లు సీఐడీ చీఫ్ వెల్లడించారు.