- రెండేళ్లలో 565 దొంగతనాలు
- జూబ్లీహిల్స్లోనే 173 కేసులు: సీపీ సజ్జనార్
బషీర్‌బాగ్, వెలుగు: పనిమనుషులను నియమించుకునే ముందు పోలీస్వెరిఫికేషన్చేయించుకోవాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ నగర ప్రజలకు సూచించారు. కమిషనరేట్ పరిధిలో రెండేళ్లలో 565 పనిమనుషుల దొంగతనం కేసులు నమోదయ్యాయని, ఇందులో 65 అత్యంత తీవ్రమైన, 500 తక్కువ తీవ్రత కలిగిన కేసులు ఉన్నాయన్నారు.
ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, ఒంటరిగా నివసించే స్టూడెంట్స్, వృద్ధులు, బిజీ లైఫ్ఉన్న కుటుంబాలు ఈ తరహా నేరాలకు గురవుతున్నట్లు చెప్పారు. జోన్ల వారీగా చూస్తే జూబ్లీహిల్స్ జోన్‌లో అత్యధికంగా 173 కేసులు, సికింద్రాబాద్ జోన్‌లో 88, ఖైరతాబాద్‌లో 77, గోల్కొండలో 70, రాజేంద్రనగర్‌లో 63, శంషాబాద్‌లో 49, చార్మినార్ జోన్‌లో 45 కేసులు నమోదయ్యాయన్నారు.
ఇంట్లో లేదా ఆఫీసు, దుకాణంలో పనికి చేర్చుకునే ముందు సదరు వ్యక్తి ఆధార్, ఇతర గుర్తింపు కార్డులు చెక్చేయాలన్నారు. గతంలో ఎక్కడ పనిచేశారో తెలుసుకుని, పాత ఓనర్లను సంప్రదించి వివరాలు ధ్రువీకరించుకోవాలన్నారు. దీంతో పాటు నియామకానికి ముందే స్థానిక పీఎస్‌లో ఉచితంగా లభించే పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవడం ఉత్తమమన్నారు. పనిలో చేరిన మొదటి 30 రోజుల పాటు వారి కదలికలు, అలవాట్లను నిశితంగా గమనించాలన్నారు.
