హైదరాబాద్‌‌ పోలీసుల వ్యూహం దేశానికే దిక్సూచి... ఢిల్లీని కదిలించిన ‘ఆపరేషన్ ఆక్టోపస్‌‌’

హైదరాబాద్‌‌ పోలీసుల వ్యూహం దేశానికే దిక్సూచి... ఢిల్లీని కదిలించిన ‘ఆపరేషన్ ఆక్టోపస్‌‌’
  • తెలంగాణ పోలీసుల ఆలోచనతో ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష
  • ‘మ్యూల్‌‌’ ఖాతాల వేటకు జాతీయ కార్యాచరణ

న్యూఢిల్లీ, వెలుగు: సైబర్‌‌  నేరగాళ్ల అక్రమ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు హైదరాబాద్‌‌  పోలీసులు ఎక్కుపెట్టిన ‘ఆపరేషన్‌‌  ఆక్టోపస్‌‌’ అస్త్రం ఇప్పుడు దేశవ్యాప్త సమరానికి దిక్సూచిగా మారింది. నగర పోలీస్  యంత్రాంగం ప్రదర్శించిన అసమాన తెగువ, వ్యూహాత్మక చొరవ దేశ రాజధాని ఢిల్లీని కదిలించడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించేలా ప్రేరేపించింది. 

డిజిటల్‌‌  ఆర్థిక మోసాల్లో కీలకమైన ‘మ్యూల్‌‌’ ఖాతాల అక్రమ చలామణిని ఛేదించడంలో హైదరాబాద్‌‌ పోలీసులు సాధించిన అద్భుత విజయాలను కేంద్ర ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌‌ఎస్‌‌) ఒక ఆదర్శ నమూనాగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే గురువారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. 

ఈ సమావేశంలో ఐ4సీ, సీబీఐ, ఆర్బీఐ వంటి అగ్రశ్రేణి సంస్థలతో పాటు వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు,  హైదరాబాద్  సీపీ వీసీ సజ్జనార్  పాల్గొన్నారు. ఇందులో  వీసీ సజ్జనార్  అందించిన క్షేత్రస్థాయి నివేదికలు, హైదరాబాద్‌‌  పోలీసుల పనితీరును ప్రత్యేకంగా ఐ4సీ, సీబీఐ, ఆర్బీఐ  కొనియాడింది. అలాగే తెలంగాణలో విజయవంతమైన మోడల్‌‌ను దేశమంతటా అమలు 
చేయాలని నిర్ణయించింది.

‘మ్యూల్ హంటర్.ఏఐ’ దేశమంతా

నేరగాళ్ల వేటలో మరింత వేగం పెంచేందుకు ‘మ్యూల్‌‌ హంటర్‌‌.ఏఐ’ సాధనాన్ని తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. సమన్వయ లోపం లేకుండా పోలీసులు, బ్యాంకులు రియల్ టైం డేటాను పంచుకోవాలని, ఎస్‌‌ఎల్‌‌బీసీల ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని నిర్ణయించారు. హైదరాబాద్  పోలీస్  యంత్రాంగం ప్రదర్శించిన ఈ కార్యదక్షత మిగిలిన రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకమని కేంద్ర అధికారులు అభిప్రాయపడ్డారు.