V6 News

హైదరాబాద్ పెట్రోల్ బంకుల్లో తగ్గిన వాహనాల క్యూలు.. కానీ.. మరో, వారం పది రోజుల్లో..

హైదరాబాద్ పెట్రోల్ బంకుల్లో తగ్గిన వాహనాల క్యూలు.. కానీ.. మరో, వారం పది రోజుల్లో..
  • డీలర్లు కోరినంత సరఫరా చేస్తున్న ఆయిల్​ కంపెనీలు
  • మళ్లీ సాధారణ స్థితికి.. ఇప్పట్లో ధరలు పెంచేది లేదన్న  కేంద్రం ప్రకటనతో ఊరట

హైదరాబాద్​ సిటీ, వెలుగు: జంట నగరాల్లో వారం రోజులుగా వాహనదారులు పడుతున్న పెట్రోల్​ కష్టాలు తీరాయి. పెట్రోల్ డీలర్లు కోరినంత ఇంధనాన్ని సరఫరా చేస్తుండడంతో బంకుల ఎదుట క్యూలు తగ్గాయి. నగరంలో1,200 మంది డీలర్లుండగా, రోజుకు10 నుంచి 11 లక్షల లీటర్ల పెట్రోల్​, 6 నుంచి 7లక్షల డీజిల్​కు డిమాండ్​ ఉంటోంది. 

కొద్ది రోజులుగా అడిగినంత సరఫరా చేయకపోవడం, కొరత ఉందన్న వదంతులతో వాహనదారులు ట్యాంక్​ఫుల్​చేసుకోవడంతో పెట్రో కష్టాలు మొదలయ్యాయి. ఎక్కడ చూసినా భారీ క్యూ లైన్లు కనిపించాయి. చాలామంది పెట్రోల్​ను బాటిల్స్​లో, డీజిల్​ను క్యాన్లలో తీసుకువెళ్లారు. దీంతో కలెక్టర్​ ప్రియాంక ఆల..ఆయిల్​ కంపెనీలు, సివిల్​సప్లయీస్​డిపార్ట్​మెంట్, డీలర్ల సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఇంధన కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

దీంతో డీలర్లు, ఆయిల్​ కంపెనీల మధ్య నెలకొన్న సందిగ్ధ పరిస్థితిని చక్కదిద్దారు. ప్రస్తుతం ఆయిల్​కంపెనీలు డీలర్లు కోరినంత ఇంధనం ఇస్తుండడంతో సిటీలోని అన్ని పెట్రోల్​బంకుల్లో సాధారణ పరిస్థితి నెలకొంది. దీంతో గురువారం ఒక్క రోజే నగరంలోని పెట్రోల్ ​బంకులకు 8 లక్షల లీటర్ల పెట్రోల్​, 6 లక్షల లీటర్ల డీజిల్​ను ఆయిల్​ కంపెనీలు సరఫరా చేశాయి. 

పెట్రోల్​ ధరలు పెరుగుతాయన్న వార్తల్లో నిజం లేదని కేంద్రం ప్రకటించడంతో ఆయిల్​కంపెనీలు డీలర్లు కోరినంత సరఫరా చేస్తున్నారు. అయితే, మరో వారం పది రోజుల్లో పెట్రోల్ ​ధరలు పెరిగే అవకాశం ఉందని, తమకు స్పష్టమైన సమాచారం ఉందని కొందరు డీలర్లు అంటున్నారు.