అమెరికాలో తెలంగాణ స్టూడెంట్ హత్య

అమెరికాలో  తెలంగాణ స్టూడెంట్ హత్య
  • పెట్రోల్​ బంక్​ వద్ద కాల్చి చంపిన నల్లజాతి దుండగుడు
  •  బీడీఎస్ పూర్తి చేసి 2023లో యూఎస్ వెళ్లిన చంద్రశేఖర్ 
  • మాస్టర్స్​ కంప్లీట్ చేసి ఫుల్ టైం జాబ్ కోసం సెర్చింగ్​ 
  • డల్లాస్​లోని ఓ పెట్రోల్​ బంక్​​లో పార్ట్ టైం జాబ్ 
  • రాత్రి డ్యూటీలో ఉండగా కాల్పులు జరిపి పారిపోయిన నీగ్రో 


ఎల్బీనగర్, వెలుగు:  అమెరికాలో ఓ నల్లజాతి దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్​కు చెందిన యువకుడు బలయ్యాడు. రంగారెడ్డి జిల్లా బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీ ఫేజ్–2కు చెందిన పోలే చంద్రశేఖర్(27) బీడీఎస్ పూర్తి చేసి, మాస్టర్స్ కోసం 2023లో అమెరికా వెళ్లాడు. టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ సిటీలో ఉంటూ ఆరు నెలల క్రితం మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేశాడు. ఫుల్ టైమ్ ప్లేస్ మెంట్ కోసం ఎదురుచూస్తూ, తాత్కాలికంగా డల్లాస్ లోని ఓ గ్యాస్ స్టేషన్ లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే శుక్రవారం రాత్రి కూడా అతడు డ్యూటీకి వెళ్లాడు. ఈ సమయంలో ఓ నల్లజాతి(నీగ్రో) దుండగుడు తన వెహికల్ లో గ్యాస్ ఫిల్లింగ్ కోసం స్టేషన్ కు వచ్చాడు. గ్యాస్ నింపుతున్న సమయంలో అనూహ్యంగా అతడు చంద్రశేఖర్​పై కాల్పులకు తెగబడ్డాడు. తీవ్ర గాయాలతో చంద్రశేఖర్ అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై అమెరికా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. చంద్రశేఖర్ పై ఆ దుండగుడు ఎందుకు కాల్పులు జరిపాడన్నది తెలియరాలేదు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని అక్కడి పోలీసులను తెలుగు అసోసియేషన్ సభ్యులు కోరారు.   

తల్లిదండ్రుల కన్నీరుమున్నీరు

చంద్రశేఖర్​మృతితో బీఎన్ రెడ్డి నగర్ టీచర్స్ కాలనీలో విషాదం నెలకొంది. కొడుకు మృతితో పోలే జగన్మోహన్ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొడుకు భవిష్యత్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్లు.. అతడి మరణ వార్త విని కుప్పకూలిపోయారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని భారత్‌‌కు తీసుకురావడానికి సహాయం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.   

ప్రభుత్వం అండగా ఉంటుంది: సీఎం 

అమెరికాలో దుండగుల కాల్పుల్లో హైదరాబాద్ విద్యార్థి చంద్రశేఖర్ మృతి చెందడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎంతో ఆవేదన కలిగించిందని ట్వీట్ చేశారు. చంద్రశేఖర్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని.. అతడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, భౌతిక కాయాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు అన్ని విధాలా సహాయం చేస్తామన్నారు. కాగా, చంద్రశేఖర్ కుటుంభ సభ్యులను మాజీ మంత్రి హరీశ్ రావు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరామర్శించారు.