లేఆఫ్స్‌తో చచ్చేంతలా భయపడుతున్న హైదరాబాద్ టెక్కీ.. షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు!

లేఆఫ్స్‌తో చచ్చేంతలా భయపడుతున్న హైదరాబాద్ టెక్కీ.. షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు!

నెల తిరిగితే అకౌంట్లోకి లక్షల్లో జీతం క్రెడిట్.. చేసేది ఐటీ జాబ్.. సమాజంలో మంచి హోదా. ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అంటే ఇదీ రేంజ్. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. చేతి నిండా జీతం ఉన్నా.. గుండె నిండా లేఆఫ్స్ భయం ఐటీ ఉద్యోగులను వెంటాడుతోంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా టెక్ వర్గాల్లో తెగ వైరల్ అవుతోంది. అతను తీసుకున్న షాకింగ్ నిర్ణయం లక్షల మంది ఐటీ ఇండస్ట్రీలోని ఉద్యోగులను ఆలోచింపజేస్తోంది. 

లోన్ తీసుకోవాలంటేనే వణుకు..
ఆ హైదరాబాద్ టెక్కీ తన పోస్ట్‌లో ఏం రాశాడంటే.. "నాకు మంచి జీతమే వస్తోంది. ఐటీ రంగంలో ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఈ భయం వల్ల ఇల్లు కొనడానికి హోమ్ లోన్, భారీ EMIలు పెట్టుకోవడానికి నాకు అస్సలు ధైర్యం సరిపోవడం లేదు" అని రాస్తూ వాస్తవ పరిస్థితులను వెల్లడించాడు. ఈ ఒక్క మాట ఇప్పుడు దేశంలోని లక్షలాది మంది టెక్కీల మనసులోని అసలు భయాన్ని తన మాటల్లో బయటపెట్టినట్లయింది.

డ్రీమ్స్ అన్నీ పోస్ట్‌పోన్..
ఒకప్పుడు ఉద్యోగంలో చేరగానే ఇల్లు, కారు కొనడం టెక్కీలకు ఒక రివాజుగా ఉండేది. ఇప్పుడు వరుస లేఆఫ్స్, హైరింగ్ ఫ్రీజ్ పరిస్థితులు యువ ఉద్యోగుల ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. సదరు టెక్కీ పోస్ట్‌పై స్పందించిన చాలా మంది నెటిజన్లు.. తాము కూడా ఉద్యోగ భద్రత లేక ఇళ్లు, కారు కొనే ప్లాన్స్‌ను వాయిదా వేసుకున్నామని ఓపెన్‌గా ఒప్పుకున్నారు. గతంలో లోన్లను ఆర్థిక వృద్ధికి మెట్లుగా చూస్తే.. ఇప్పుడు వాటిని జీవితాన్ని మింగేసే భారంగా భావిస్తోంది యువత అనిశ్చితి ఉపాధి అవకాశాల కారణంగా.

హై-శాలరీ ఉంది.. కానీ సెక్యూరిటీ ఎక్కడ?
ఈ డిస్కషన్ కేవలం ఉద్యోగం పోవడం గురించే కాదు.. ఒకవేళ చేతిలో భారీ అప్పులు ఉన్నప్పుడు లేఆఫ్స్ స్ట్రైక్ అయితే పరిస్థితి ఏంటనే మానసిక ఆందోళనపై సాగుతోంది. ఎంత ఎక్కువ జీతం వస్తున్నా.. రేపటి గురించిన గ్యారెంటీ లేని ఈ అన్‌ప్రెడిక్టబుల్ జాబ్ మార్కెట్ యువతలో తీవ్రమైన మానసిక ఒత్తిడిని పెంచుతోంది. నచ్చినవి కొనుక్కుని జీవితంలో ముందుకెళ్లటం కంటే అనుకోని పరిస్థితులు ఎదురైతే జీవితం అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండాలని టెక్కీలు ప్రస్తుతం భావిస్తున్నారట. మొత్తానికి హైదరాబాద్ ఇంజనీర్ షేర్ చేసిన ఈ చేదు నిజం.. భారత కార్పొరేట్ ఐటీ రంగంలో జీతాలు పెరిగినా, ఉద్యోగుల్లో సేఫ్టీ అనే నమ్మకం మాత్రం నిలువునా పడిపోతోందని చెప్పకనే చెబుతోంది.