మంచి నీళ్లు జాగ్రత్తగా వాడుకోండి : హైదరాబాద్ జనానికి జల మండలి అలర్ట్

మంచి నీళ్లు జాగ్రత్తగా వాడుకోండి : హైదరాబాద్ జనానికి జల మండలి అలర్ట్

హైదరాబాద్‌: ఎల్‌నినో ప్రభావం, కరువు పరిస్థితుల నేపథ్యంలో నగరంలో నీటి పొదుపుపై జలమండలి ప్రత్యేక దృష్టి సారించింది. నీటి నిల్వలు తగ్గిపోయే ప్రమాదం ఉందని, నగరవాసులు ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించింది. ముఖ్యంగా అవసరాలకు మాత్రమే నీటిని ఉపయోగించాలని, అనవసరంగా నీటిని వృథా చేయవద్దని విజ్ఞప్తి చేసింది.

నవంబర్‌ చివరి నాటికి సింగూరు జలాశయంలో నీటి నిల్వలు తగ్గిపోయే ప్రమాదం ఉందని జలమండలి ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే నగరంలో నీటి సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో నీటి వృథాను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని కోరుతోంది.

పైపులతో కడిగితే చర్యలు

వాహనాలు, సెల్లార్లు, ర్యాంపులు, రోడ్లను పైపుల ద్వారా నీటితో కడగడంపై జలమండలి నిషేధం విధించింది. నీటిని అధికంగా వినియోగించే ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

రోజువారీ శుభ్రత పనుల కోసం నీటిని వినియోగించకుండా డ్రై స్వీపింగ్‌ పద్ధతిని పాటించాలని సూచించింది. అవసరం లేనప్పుడు కుళాయిలను పూర్తిగా మూసివేయాలని, ఇళ్లలో నీటి లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయించాలని కోరింది.

నీటి పొదుపుపై అపార్ట్‌మెంట్లలో నివాసితులకు అవగాహన కల్పించాలని జలమండలి పిలుపునిచ్చింది. అపార్ట్‌మెంట్ల వాచ్‌మెన్లు, నివాసితులు జలమండలి సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేసింది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి నీటిని వృథా కాకుండా వినియోగిస్తే, అందుబాటులో ఉన్న నీటి నిల్వలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని తెలిపిది. భవిష్యత్తులో నీటి కొరత సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు నగరవాసులందరూ ఇప్పటి నుంచే నీటి పొదుపును అలవాటుగా మార్చుకోవాలని జలమండలి సూచిస్తోంది.