హైదరాబాద్ వాసులూ..  నీటిని పొదుపుగా వాడండి ..కార్లు, బైకులు కడగొద్దు.. రోడ్లపై పారబోయొద్దు :  సీఎస్ సంజయ్ జాజు 

హైదరాబాద్ వాసులూ..  నీటిని పొదుపుగా వాడండి ..కార్లు, బైకులు కడగొద్దు.. రోడ్లపై పారబోయొద్దు :  సీఎస్ సంజయ్ జాజు 
  • ప్రతి ఒక్కరూ 20% వాటర్​ను సేవ్​ చేయాలి 
  • దీనిపై సెలబ్రిటీలతో ప్రచారం చేయిస్తం: సీఎస్​

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ప్రజలకు నిరంతరం తాగునీరు అందించేందుకు ప్రభుత్వం తరుఫున అన్ని చర్యలు తీసుకుంటున్నామని, కానీ ప్రస్తుత కష్టకాలంలో ప్రజలంతా సహకరించి, నీటిని పొదుపుగా వాడుకోవాలని సీఎస్ సంజయ్ జాజు విజ్ఞప్తి చేశారు. ‘మీరు రోజూ వాడే నీటిలో కనీసం 20 శాతం ఆదా చేసినా, రోజుకు ఏకంగా 80 ఎంజీడీ(మిలియన్​ గ్యాలన్ల) నీరు ఆదా అవుతుంది.. ఇది మరింతమందికి సరిపోతుంది.. నీటిని వృథా చేయకండి. మరీ ముఖ్యంగా జలమండలి సరఫరా చేసే తాగునీటితో కార్లు, బైకులు కడగడం, రోడ్లపై పారబోయడం లాంటివి చేయద్దు..’ అని సూచించారు.

సీఎం ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ), ఎంఎంసీ, సీఎంసీ కార్పొరేషన్ల పరిధిలో తాగునీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం సెక్రటేరియట్‌‌‌‌లో సీఎస్​ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో పంచాయతీరాజ్ స్పెషల్ సీఎస్ దానకిశోర్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, కమిషనర్లు ఆర్వీ కర్ణన్, వినయ్ కృష్ణారెడ్డి, సృజన, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్​ మాట్లాడుతూ.. మూడు కార్పొరేషన్లలో నీటి పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నగరవ్యాప్తంగా 60 రోజుల పాటు విస్తృత ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ అవగాహన సదస్సుల్లో సినీ నటులు, సెలబ్రిటీలు, ప్రముఖులను భాగస్వాములను చేయాలన్నారు. 

అదనంగా 60 ఎంజీడీలకు యాక్షన్‌‌‌‌ ప్లాన్​

సిటీ తాగునీటి అవసరాలను తీర్చేందుకు అదనంగా 60 ఎంజీడీల నీటిని సమకూర్చుకునేలా స్పష్టమైన యాక్షన్‌‌‌‌ ప్లాన్ సిద్ధం చేశామని సీఎస్ వివరించారు. ప్రస్తుతం కోర్ ఏరియాకు ఉస్మాన్‌‌‌‌సాగర్, హిమాయత్‌‌‌‌సాగర్, మంజీరా, కృష్ణా, గోదావరి ద్వారా రోజూ 560 ఎంజీడీల నీటిని అందిస్తున్నామని చెప్పారు.

పెరుగుతున్న డిమాండ్‌‌‌‌కు అనుగుణంగా కృష్ణా నుంచి అదనంగా 15 ఎంజీడీలు, మిషన్ భగీరథ ద్వారా 20 ఎంజీడీలతో పాటు అదనంగా మరో 20 ఎంజీడీలు, జంట జలాశయాల నుంచి చెరో 5 ఎంజీడీల చొప్పున మొత్తం 60 ఎంజీడీల అదనపు నీటిని తరలించనున్నట్లు వెల్లడించారు. మల్లన్నసాగర్‌‌‌‌లో ప్రస్తుతం 5 టీఎంసీల నీరు నిల్వ ఉందని, అక్కడి నుంచి నగరానికి నీటిని తీసుకొచ్చే పైప్‌‌‌‌లైన్ పనులు నవంబర్ నాటికి పూర్తి కానున్నాయని తెలిపారు. దీని ద్వారా నవంబర్ నుంచి అదనంగా మరో 20 ఎంజీడీల నీరు అందుబాటులోకి వస్తుందన్నారు.

 ఎస్టీపీలు పూర్తిస్థాయిలో నడపాలి.. 

భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో గేటెడ్ కమ్యూనిటీలు, భారీ అపార్ట్‌‌‌‌మెంట్లలోని మురుగునీటి శుద్ధి ప్లాంట్లను (ఎస్టీపీలు) పూర్తి స్థాయిలో నడపాలని సీఎస్ ఆదేశించారు. శుద్ధి చేసిన నీటిని గార్డెనింగ్, వాహనాల క్లీనింగ్, ఇతర గృహేతర అవసరాలకు వాడేలా ప్రజల్లో అవేర్‌‌‌‌‌‌‌‌నెస్ తేవాలన్నారు. ఈ శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసేందుకు జలమండలి ప్రత్యేకంగా ‘గ్రీన్ ట్యాంకర్లు’ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు.

మరోవైపు మంజీరా, సింగూరు పరిధిలోని మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో తాగునీటి కొరత రాకుండా ముందస్తు ప్రత్యామ్నాయ ప్రణాళికను అమలు చేస్తున్నామని, అక్కడ ఇప్పటికే బోరుబావులు, ఇతర నీటి వనరులను గుర్తించామని చెప్పారు. తాగునీటి సరఫరాకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, అవసరమైన నిధులకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. నీటి సరఫరా ప్రక్రియలో శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.