- మీ సేవ కేంద్రాల్లో వాడే పేపర్ మార్చిన ప్రభుత్వం
- ఏండ్ల తరబడి దాచుకునేలా ప్రత్యేకంగా తయారీ
- ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: మీసేవా సర్టిఫికెట్ల భద్రత, మన్నిక పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నాళ్లయినా చినగకుండా, నీళ్లు పడినా దెబ్బతినకుండా మన్నికగా ఉండేలా మీ సేవ సర్టిఫికెట్ల కోసం ప్రత్యేకమైన పేపర్ను తీసుకొచ్చింది. ఈ సర్టిఫికెట్లలో 15 అత్యాధునిక ఫీచర్లను పొందుపరుస్తున్నారు. నకిలీ సర్టిఫికెట్ల తయారీ, అనధికార నకళ్లను అరికట్టేలా వీటిని రూపొందిస్తున్నారు.
మడతపెట్టడం, ఎక్కువ కాలం భద్రపరచడం వల్ల కలిగే నష్టాన్నీ ఈ పేపర్తగ్గిస్తుంది. లామినేషన్ చేయించాల్సిన అవసరమూ ఉండదు. ఈ సర్టిఫికెట్ను హైదరాబాద్ ప్రజాభవన్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మంగళవారం ఆవిష్కరించారు. బర్త్, డెత్ సర్టిఫికెట్లతోపాటు విద్య, ఉద్యోగ, ఇతర అధికారిక సర్టిఫికెట్లు ప్రజల జీవితంలో ఎంతో ముఖ్యమైనవని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
కొన్ని సర్టిఫికెట్లను జీవితాంతం భద్రంగా ఉంచుకోవాల్సి ఉంటుందని, అలాంటివి త్వరగా పాడవకుండా చూడటంతో పాటు వాటి విశ్వసనీయతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే లు రాజ్ ఠాకూర్, విజయ రమణా రావు, ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్డీ) కమిషనర్ రవికిరణ్ పాల్గొన్నారు.
