నీళ్లు వేస్ట్ చేస్తే  రూ.5 వేల ఫైన్ ..మహారాష్ట్రను వణికిస్తున్న ఎల్‌‌‌‌నినో కరువు

నీళ్లు వేస్ట్ చేస్తే  రూ.5 వేల ఫైన్ ..మహారాష్ట్రను వణికిస్తున్న ఎల్‌‌‌‌నినో కరువు
  •  పుణెలో ప్రతి గురువారం నీటి సరఫరా బంద్
  • ముంబై మహానగరంలో 10 శాతం నీటి కోత
  • రత్నగిరిలో 39.2 డిగ్రీలు.. అక్టోబర్ రికార్డు
  • జాల్నా జిల్లాలో ఎండుతున్న ద్రాక్ష తోటలు

ముంబై : మహారాష్ట్రలో ఎండలు మండుతున్నాయి. ఎల్‌‌‌‌ నినో ప్రభావంతో ఏర్పడిన తీవ్ర కరువు పరిస్థితులతో రాష్ట్రం అల్లాడుతోంది. సాగు నీళ్లకే కాకుండా తాగు నీటికీ తీవ్ర కటకట ఏర్పడింది. దీంతో ముంబై, పుణె సహా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వం ఆంక్షలు అమలులోకి తెచ్చింది. పుణెలో ప్రతి గురువారం నీటి సరఫరాను బంద్ చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

ఎవరైనా నీటిని వృథా చేస్తే రూ. 5 వేల ఫైన్ విధిస్తామని హెచ్చరించారు. ప్రధానంగా కొంకణ్ తీరం వెంబడి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. జాల్నాలో ద్రాక్ష తోటలు ఎండుతున్నాయి. కొన్నిరోజులుగా ముంబైలో భారీగా టెంపరేచర్లు నమోదవుతున్నాయి. మంగళవారం కూడా ముంబైలో తీవ్ర వేడి, ఉక్కపోత వాతావరణం కొనసాగింది. ముంబైలో గత వారం నుంచి తీవ్రమైన అక్టోబర్ ఎండల ప్రభావం కొనసాగుతుండగా, రాబోయే రోజుల్లో పెద్దగా ఉపశమనం లభించే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఎండుతున్న ద్రాక్ష తోటలు 

మహారాష్ట్ర మరాఠ్వాడా ప్రాంతంలో జాల్నా జిల్లాలో తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొన్నాయి. జైక్వాడి జలాశయం నుంచి రోజుకు దాదాపుగా 1.649 బిలియన్ లీటర్ల నీరు ఆవిరి అవుతున్నట్టుగా అంచనా వేశారు. కరువు తీవ్రతతో జిల్లాలో వందలాది హెక్టార్లలో ద్రాక్ష తోటలు ఎండిపోతున్నాయని స్వతంత్ర జర్నలిస్ట్ సోహిత్ మిశ్రా నివేదించారు. పంటలు ఎండిపోవడంతో రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 

పుణెలో గురువారాల్లో వాటర్ షట్‌‌‌‌డౌన్

పుణె మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి గురువారం నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పుణె మిర్రర్ కథనం ప్రకారం.. నీటి సరఫరాలో 10% కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారు. నీటి లభ్యతపై ఎల్‌‌‌‌ నినో ప్రభావం చూపుతుందన్న ఆందోళనల మధ్య ఈ ముందస్తు చర్య తీసుకున్నట్లు అడిషనల్ మున్సిపల్ కమిషనర్ పవ్‌‌‌‌నీత్ కౌర్ తెలిపారు. షెడ్యూల్ చేసిన షట్‌‌‌‌డౌన్‌‌‌‌కు ముందే నీటిని నిల్వ చేసుకోవాలని
 ప్రజలకు సూచించారు.  

రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు

నీటి కొరత నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలలో కనీసం 10 శాతం నీటి కోతను తప్పనిసరి చేసింది. అనధికారిక వినియోగం, పైప్‌‌‌‌లైన్ ట్యాంపరింగ్, తాగునీటి వాణిజ్య దుర్వినియోగానికి పాల్పడితే భారీ జరిమానాలు, ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌లు నమోదు చేస్తామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. పుణె సహా అనేక ప్రాంతాల్లో తాగునీటిని వృథా చేస్తే.. రూ. 5 వేల ఫైన్ విధిస్తామని అధికారులు హెచ్చరించారు. 

ముంబైలోనూ నీటి కోతలు

ముంబై నగరానికి నీటిని సరఫరా చేసే ఏడు సరస్సులలో నీటి నిల్వలు అడుగంటడంతో అధికారులు నీటి సంరక్షణ చర్యలను అమలు చేస్తున్నారు. ఆగస్ట్ 31, 2027 వరకు నగర అవసరాలను తీర్చడానికి ప్రణాళికలు రచిస్తున్నందున నీటిని జాగ్రత్తగా వాడాలని బృహన్‌‌‌‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ముంబైకి రోజుకు సుమారు 4,664 మిలియన్ లీటర్ల నీరు అవసరం కాగా, సగటు రోజువారీ సరఫరా సుమారు 4,100 మిలియన్ లీటర్లుగా ఉంది.

దీంతో డిమాండ్, సరఫరా మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉంది. దీంతో మే 15న ప్రవేశపెట్టిన 10 శాతం నీటి కోత అలాగే కొనసాగుతోంది. పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు, స్పోర్ట్స్ క్లబ్‌‌‌‌లకు ప్రత్యేకంగా 20 శాతం నీటి తగ్గింపు వర్తింపచేస్తున్నారు. మున్సిపల్ యంత్రాంగం నీటి వృధాను అరికట్టాలని, త్రాగే నీరు కాకుండా ఇతర అవసరాలకు ప్రత్యామ్నాయ వనరులను ఉపయోగించాలని, లీకవుతున్న పైప్‌‌‌‌లైన్ల గురించి సమాచారం ఇవ్వాలని కోరింది.