- సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను వెంటనే తొలగించాలని డిమాండ్
న్యూఢిల్లీ, వెలుగు: దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కేంద్రం ఖూనీ చేస్తోందని విప్ఆది శ్రీనివాస్ ఆరోపించారు. ఈడీ, సీబీఐతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ..సర్ పేరుతో ఓట్లను తొలగించడంపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ జనాభా పెరుగుతుంటే.. ఓటర్ల సంఖ్య ఎందుకు తగ్గుతోందని, 13 కోట్లకు పైగా ఓట్లను తీసేయడానికి కారణాలేంటని ప్రశ్నించారు.
చనిపోయిన వారి ఓట్ల తొలగింపు పేరిట మిగతా ఓట్లను తీసేయడాన్ని సమర్థించుకోలేరని విమర్శించారు. లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ఢిల్లీలో నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీ విజయవంతమైందన్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ నేతలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారని చెప్పారు. ర్యాలీ విజయవంతం కావడంతోనే బీజేపీ నేతలు విమర్శలకు దిగుతున్నారని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయంగా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమని ఎద్దేవా చేశారు.
అర్హుల ఓటు హక్కు కాపాడాలి
అర్హులైన వారి ఓటు హక్కును కాపాడాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తనపై వచ్చిన అభ్యంతరాలకు సమాధానం చెప్పాలన్నారు. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులకు రాజకీయ పదవులు కల్పించడంపై సమాధానం చెప్పాలని నిలదీశారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ఓటు హక్కును కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, అర్హులైన వారి ఓట్ల తొలగింపును సహించబోమని తెలిపారు.
