హైదరాబాద్, వెలుగు: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లిలోని సర్వే నంబర్లు 1,003 నుంచి 1,006 వరకు విస్తరించిన 13.17 ఎకరాల భూమి వివాదంలో తాము ఇకపై జోక్యం చేసుకోబోమని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా తెలిపింది. ఈ మేరకు దాఖలైన మూడు కోర్టు ధిక్కరణ పిటిషన్లను విచారించిన జస్టిస్ నగేశ్ భీమపాక గురువారం విచారణను ఈ నెల 8కి వాయిదా వేశారు. సదరు భూమిలో కోర్టు ఉత్తర్వులు, అలాగే గతంలో హైడ్రా ఇచ్చిన హామీకి విరుద్ధంగా రాత్రికి రాత్రే కూల్చివేతలు చేపట్టారని ఆరోపిస్తూ ఎన్‌వీఎన్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ మూడు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేసింది.
విచారణ సందర్భంగా హైడ్రా తరఫు న్యాయవాది స్పందిస్తూ.. కోర్టు ఆదేశాల పరిధిలో ఉన్న భూమి విషయంలో హైడ్రా ఎలాంటి జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో గతంలోనే హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పిటిషనర్‌కు చెందిన నిర్మాణాలను కూల్చివేసిన నేపథ్యంలో వాటిని 24 గంటల్లోపు కూల్చివేతలకు ముందు ఉన్న స్థితికి తీసుకురావాలని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది.
అయినప్పటికీ ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కాంపౌండ్ ఫెన్సింగ్, భద్రతా గదులు, ప్రవేశ ద్వారాలను కూల్చివేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. యంత్రాలు, ఇతర పరికరాలను ధ్వంసం చేయడం, విద్యుత్ సరఫరా నిలిపివేయడం వంటి చర్యలపైనా ఆక్షేపణ వ్యక్తం చేసింది. హైకోర్టు ఉత్తర్వుల అనంతరం కూడా హైడ్రా జోక్యం కొనసాగుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించగా, హైడ్రా తాజాగా హామీ ఇచ్చింది.
