
- హైకోర్టు తీర్పు మేరకు సర్వే నంబర్
- 59లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
- రూ.3,600 కోట్ల విలువైన 36 ఎకరాల
- ప్రభుత్వ భూమిని కాపాడిన అధికారులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: కొండాపూర్‌లో 36 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. హైకోర్టు తీర్పు మేరకు శనివారం హైడ్రా అక్కడ 5 తాత్కాలిక షెడ్లను కూల్చివేసింది. స్వాధీనం చేసుకున్న ఈ భూమి విలువ దాదాపు రూ.3,600 కోట్ల దాకా ఉంటుందని అధికారులు తేల్చారు. కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం పక్కనే ఉన్న భిక్షపతినగర్‌లో సర్వే నంబర్ 59లో ఉన్న 36 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార కార్యకలాపాలు చేపట్టారు.
ఈ స్థలంపై హైకోర్టులో కేసు నడుస్తున్నది. విచారణలో భాగంగా ఇది ప్రభుత్వ భూమి అని తేలడంతో ఆక్రమణలు తొలగించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. దీంతో హైడ్రా సిబ్బంది శనివారం ఈ ఆక్రమణల తొలగింపును అత్యంత పకడ్బందీగా చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయా చోట్ల భారీ పోలీస్బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలోకి మీడియాసహా ఎవరినీ అనుమతించలేదు. దాదాపు 2 కిలోమీటర్ల పరిధిలో కారిడార్లు ఏర్పాటు చేశారు. స్థానికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లను తొలగించడంతోపాటు అది ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టారు. ఆ స్థలం చుట్టూ కంచెను ఏర్పాటు చేశారు.