హైదరాబాద్ సిటీ, వెలుగు: సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ కూల్చివేతలపై గ్రామంలో బీఆర్ఎస్ లీడర్ ఎంఎ ముఖీం తమ్ముడు అజీమ్ ప్రభుత్వ స్థలంలో నిర్మించిన 6 ఫ్లోర్ల భవనానికి నోటీసులు ఇచ్చామని మంగళవారం హైడ్రా ఓ ప్రకటనలో పేర్కొంది. అజీమ్ దుబాయ్లో నివాసం ఉంటున్నాడని, షోకాజ్ నోటీసులు, స్పీకింగ్ ఆర్డర్లు ఏమీ పట్టించుకోలేదని అధికారులు తెలిపారు. అజీమ్ అపార్టుమెంట్లు కట్టి హైడ్రా వచ్చేసరికే అమ్ముకున్నాడన్నారు.
అక్కడ ఇప్పటికే 4 అపార్టుమెంట్లు నిర్మించి ప్రజలకు అమ్మేయగా శనివారం తొలగించిన 6 అంతస్తుల భవన నిర్మాణానికి సంబంధించి నిర్మాణంలో ఉన్న సమయంలోనే హైడ్రా హెచ్చరించిందని తెలిపారు. ఈ భవనానికి ఎలాంటి అనుమతులు లేవని 2025 జూన్ నెల 25వ తేదీన హైడ్రా షోకాజ్ నోటీసు ఇచ్చిందని, ఈ షోకాజ్ నోటీసుకు రిప్లై ఇచ్చిన ఆయన గతంలో గ్రామపంచాయతీ అనుమతులు ఇచ్చిందని, కిష్టారెడ్డి పేటలో తన భవనం వస్తుందని అజీమ్ వివరణ ఇచ్చాడని, కానీ నిర్మాణ అనుమతులను హైడ్రాకు ప్రొడ్యూస్ చేయలేదన్నారు.
పంచాయతీ అనుమతులున్నాయని అజీమ్ చెప్పడంతో వాటిపై విచారించగా.. పంచాయతీతో పాటు తర్వాత మున్సిపాలిటీలోనూ ఎక్కడా ఎలాంటి అనుమతులు తీసుకున్నట్టు ఆధారాలు లేవని హైడ్రా నిర్ధారించింది. దీంతో 2025 జులై 3వ తేదీన స్పీకింగ్ ఆర్డర్ను హైడ్రా జారీ చేసింది. అజీమ్ కడుతున్న భవనానికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో తొలగించాలని సూచిస్తూ స్పీకింగ్ ఆర్డర్లో పేర్కొంది. 15 రోజుల గడువు కూడా ఇచ్చింది. లేని పక్షంలో హైడ్రా తొలగిస్తుందని ఆ స్పీకింగ్ ఆర్డర్లో స్పష్టంగా పేర్కొంది.
దీని ఖర్చు కూడా ఆ భవన యజమాని చెల్లించాల్సి ఉంటుందని కూడా హైడ్రా తెలిపింది. షోకాజ్ నోటీసు, స్పీకింగ్ ఆర్డర్ను పట్టించుకోకుండా భవన నిర్మాణాన్ని అజీమ్ పూర్తి చేశాడు. హైడ్రా నోటీసులతో ఆ భవనంలోని 45 ఫ్లాట్లు ఉండగా ఒక్కటి కూడా కొనడానికి వినియోగదారులు ముందుకు రాలేదు. దీంతో వాటిని తన అనుచరులతో 20 ప్లాట్ల వరకూ ఉంచాడు. నివాసాల జోలికి హైడ్రా వెళ్లదనే ఉద్దేశంతో వీరందరినీ అన్ని అంతస్తుల్లో ఉన్నట్టు చూపించాడు.
గతంలో అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో కట్టిన 4 అపార్టుమెంట్లలో కొన్నవారు నష్టపోకూడదని సైలెంట్ గా ఉన్న హైడ్రా షోకాజ్ నోటీసులు, స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చిన భవనం విషయంలో చర్యలకు సిద్ధమైంది. అద్దెకు ఉన్న వారిని ఖాళీ చేయాలని స్పష్టంగా సూచిస్తూ భవన యజమానికి నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు అందుకున్న అజీమ్ ఖాళీగా ఉన్న ఫ్లాట్ల ఉన్నవారిని ఖాళీ చేయించలేదు. దీంతో ఈ నెల 11వ తేదీన రెవెన్యూ, మున్సిపల్, పోలీసు శాఖలతో కలిసి హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది.

