- పనుల పురోగతిపై అసంతృప్తి
హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్పరిధిలోని కృష్ణానగర్లో వరద ముప్పును తగ్గించేందుకు జరుగుతున్న డీసిల్టింగ్ పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం పరిశీలించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన పూడికతీత పూర్తి చేయాలని, జీహెచ్‌ఎంసీతో సమన్వయం చేసుకుని పనులు స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులు ఇప్పటికే పూర్తవ్వాల్సి ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంకటగిరి నుంచి వచ్చే ప్రధాన వరద కాలువ నిర్మాణ అంశాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామన్నారు.
మెట్రో మార్గం కింద కాలువ నిర్మాణం చేపట్టే సమయంలో మెట్రో పిల్లర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిపుణుల సలహాలతో పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. షేక్పేట్–గచ్చిబౌలి ప్రధాన రహదారి వద్ద ఉన్న మల్కం చెరువు వరద కాలువలను కూడా కమిషనర్ పరిశీలించారు. చెరువు ఇన్లెట్లు, ఔట్‌లెట్లు సక్రమంగా లేకపోవడంతోనే ఏటా వరదలు వస్తున్నాయన్నారు. వరద నీరు సాఫీగా వెళ్లేందుకు చెరువులో నీటిమట్టాన్ని 2 మీటర్లు తగ్గించాలని, వారం రోజుల్లో ఇన్లెట్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఔట్లెట్ వద్ద గేటును విస్తరించి, రోడ్డు కింద ఉన్న పైపులైన్ల పూడిక తీతకు రోబోటిక్ సాంకేతికతను వాడాలని సూచించారు.
