హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ,ఖాజాగూడ సరిహద్దుల్లో హైడ్రా అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఆక్రమణల బారిన పడకుండా దాదాపు రూ.30 వేల కోట్ల విలువైన 200 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ శుక్రవారం ఫెన్సింగ్ వేసి రక్షణ కల్పించారు. అక్కడ హిమాలయాల కంటే పురాతనమైన, సుమారు 250 కోట్ల ఏండ్ల చరిత్ర కలిగిన సహజసిద్ధ రాతిగుట్టలు,పురాతన రాతి గుహలు ఉన్నాయి.
వీటిని కాపాడాలని 'సొసైటీ టు సేవ్ రాక్స్' ప్రతినిధులు గతంలో హైకోర్టును ఆశ్రయించగా.. హద్దులు నిర్ధారించి ఫెన్సింగ్ వేయాలని 2019లోనే కోర్టు ఆదేశించింది. అయితే, ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్ల అక్కడ అక్రమ నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. దీనిపై పర్యావరణ ప్రేమికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దాంతో కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి భూమిని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు.
ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి 63.05 ఎకరాలు
రెవెన్యూ రికార్డుల ప్రకారం.. పుప్పాలగూడ పరిధిలోని సర్వే నంబర్లు 452/1, 454/1లలో కలిపి మొత్తం 293.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 263.05 ఎకరాలను గతంలో ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు కేటాయించింది. అయితే రెండు గ్రామాల మధ్య ఉన్న భూహద్దుల వివాదాల కారణంగా 63.05 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. దీంతో మిగిలిన 200 ఎకరాల హెచ్‌ఎండీఏ భూమిని, ఆలయాలు, దర్గాలకు కేటాయించిన 10 ఎకరాల భూమిని హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేసి సంరక్షించారు.
ఈ రాతిగుట్టలకు ఆనుకుని ఉన్న భగీరథమ్మ చెరువు పునరుద్ధరణ పనులు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ ప్రాంతాన్ని రక్షించడం ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందని, భవిష్యత్తులో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
